టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్‌కు తండ్రి మిస్సింగ్ కేసులో ఊరట లభించింది. సోమవారం తన తండ్రి మహదేవ్ జాదవ్ కనిపించడం లేదంటూ పుణేలోని అలంకార్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. కాగా మంగళవారం సాయంత్రం కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాలో ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహదేవ్ జాదవ్‌ను తమ వెంట తీసుకొచ్చి కేదార్ జాదవ్ కుటుంబసభ్యులకు అప్పగించారు.
కేదార్ జాదవ్ తన తల్లిదండ్రులు మహదేవ్ జాదవ్, మందాకినిలతో కలిసి పుణేలోని కొథ్రూడ్‌లోని సిటీప్రైడ్ థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. 75 సంవత్సరాల వయసు ఉన్న మహదేవ్ జాదవ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లోని పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న మహదేవ్ ఆ తర్వాత గేట్ తీసుకొని బయటికి వెళ్లారు. కొథ్రూడ్ జంక్షన్‌లో ఆటో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అలంకార్ పోలీసులను ఆశ్రయించిన కేదార్ జాదవ్ తండ్రి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు.
''కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ కొంతకాలంగా మతిమరుపు(డిమెన్షియా) వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మార్నింగ్ వాక్ కోసమని బయటికి వెళ్లిన మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాకు చేరుకున్నాడు. తాను ఎక్కడ ఉన్నానో తెలియక కాస్త అయోమయానికి గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహదేవ్ కదలికలను గుర్తించాం. ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందని.. కుటుంబసభ్యులకు అప్పగించామని'' సీనియర్ ఇన్‌స్పెక్టర్ అజిత్ లక్డే తెలిపారు. తన తండ్రిని క్షేమంగా అప్పగించినందుకు కేదార్ జాదవ్ అలంకార్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక 2014లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కేదార్ జాదవ్ 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. గతంలో సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవ్ 2022లో జరిగిన వేలంలో అమ్ముడిపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.
చదవండి: హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
Comments
Please login to add a commentAdd a comment