చెన్నై నిష్క్రమణ.. ప్రక్షాళన తప్పదా..? | CSK Get Last Place In IPL 2020 Season | Sakshi
Sakshi News home page

చెన్నై నిష్క్రమణ.. ప్రక్షాళన తప్పదా..?

Published Sat, Oct 24 2020 8:40 AM | Last Updated on Sat, Oct 24 2020 10:53 AM

CSK Get Last Place In IPL 2020 Season - Sakshi

షార్జా : ఐపీఎల్‌-2020 సీజన్‌లో మాజీ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కథ ముగిసింది. శుక్రవారం రాత్రి షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలై ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే అభిమానులు ఆశలను అడియాశలు చేస్తూ.. ఎవరూ ఊహించిన విధంగా 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదో ఓటమితో తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి చివరి స్థానానికి పరిమితం అయ్యింది. మూడు సార్లు ఛాంపియన్‌, ఐదుసార్లు రన్నరఫ్‌తో పాటు అన్ని సీజన్స్‌లో ఫ్లే ఆఫ్స్‌కి చేరిన ఘనత కలిగిన చెన్నై ఈసారి టోర్నీలో కనీస పోరాట పటిమను సైతం చూపలేక ఆటగాళ్లు ప్రత్యర్థికి దాసోహమన్నారు. దీంతో కేవలం మూడు విజయాలు ఆరు పాయింట్లతో చివరి స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. (‘కింగ్స్‌’ ఖేల్‌ ఖతమ్‌!)

జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ కావడంతో తొలి నుంచీ చెన్నైకి అభిమానులు ఎక్కువే. ధోనీతో పాటు స్టార్‌ ఆటగాళ్లు సురేష్‌ రైనా, రవీంద్ర జడేనా, అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ప్రధాన ఆటగాళ్లు కావడంతో తొలినుంచీ జట్టు ప్రదర్శనపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అనుహ్యంగా టోర్నీ నుంచి మిస్టర్ ఐపీఎల్‌ సురేష్‌ రైనా, హర్బజన్‌సింగ్‌ వైదొలగడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడినట్టు పాయింట్ల పట్టికను చూస్తే అర్థమవుతోంది. సీజన్‌-2020లో తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన ముంబైపై విజయం సాధించి ఖాతా తెరిచిన ధోనీ సేన అలాంటి ప్రదర్శన కేవలం ఆ ఒక్కమ్యాచ్‌కే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం ఫేలమైన ఆట తీరుతో సీనియర్‌ సిటిజన్స్‌ అనే బిరుదుతో పాటు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొంది. (సీఎస్‌కే కథ ముగిసినట్లే: ధోనీ ఇక తప్పుకో!)

రైనాలేని లోటు
వాట్సన్‌, రాయుడు, డుప్లెసిస్‌తో పాటు ధోనీ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్స్‌‌ ఉన్నా.. జట్టును గట్టెక్కించలేకపోయారు. టాప్‌ ఆర్డర్‌లో రైనా లేని లోటు టోర్నీ అంతా స్పష్టంగా కనిపించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ నుంచి అభిమానులు ఎంతో అశించి చివరికి భంగపడ్డారు. స్థాయికి తగ్గ ఆటను కెప్టెన్‌ ప్రదర్శించలేదని జట్టు యాజమాన్యంతో పాటు, అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో సీఎస్‌కేపై పెద్ద ఎత్తున కామెంట్స్‌ వస్తున్నాయి. వచ్చే సీజన్‌లోనైనా టీంను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ధోనీ ఇక రిటైర్మెంట్‌ ప్రకటించాలని కామెంట్స్‌ పెడుతున్నారు. జట్లులో దాదాపు చాలామంది ఆటగాళ్లు 33 ఏళ్లుకు పైబడిన వారు కావడంతో ఇతర జట్లతో సమానంగా వేగాన్ని అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. వారందరినీ తొలగించి యువకులతో కూడిన జట్టుతో బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాంటిగ్‌ ఆర్డర్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేసి.. యంగ్‌ ప్లేయర్స్‌ను తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తున్నారు. ఇక సీఎస్‌కే ప్రదర్శనపై సీఎస్‌కే జట్టు యాజమాన్యం ఏ విధమైన మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.  

ముంబైకి బెర్తు ఖరారు
గత మ్యాచ్‌ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో పాటు బెంగళూరు కూడా దాదాపు ఆ జాబితాలో చేరినట్లే. ఇక నాలుగో స్థానం కోసం కోల్‌కత్తా, హైదరాబాద్‌, పంజాబ్‌ పోటీ పడుతున్నాయి. ప్రస్తుతమున్న పాయింట్స్‌ ప్రకారం.. రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ బరిలో నిలవడం కష్టతరంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement