చెన్నై: ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) యజమాని ఎన్. శ్రీనివాసన్ 24 గంటల్లోపే సాంత్వన వచనాలు పలికారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. ‘ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు రైనా చేసిన సేవలు అసమానం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. రైనా మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాల్సిన సమయమిది. మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంది. కష్టకాలంలో ఇప్పుడు కూడా మేం అతని వెంటే ఉంటాం.
నా వ్యాఖ్యల్లో రైనాను తప్పు పట్టలేదు’ అని శ్రీనివాసన్ స్పష్టతనిచ్చారు. మరోవైపు రైనా వెనక్కి రావడంలో ‘హోటల్ గది’కి మించిన మరో బలమైన కారణం ఏదైనా ఉండవచ్చని చెన్నై టీమ్ సంబంధిత వ్యక్తి ఒకరు వెల్లడించారు. ‘సీఎస్‌కే నిబంధనల ప్రకారం కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు హోటల్‌లో అత్యుత్తమ సౌకర్యాలు ఉన్న గది ఇస్తారు. రైనాకు కూడా ఇలాంటిది ఇచ్చారు. అందులో బాల్కనీ లేకపోవడమనేది మరో అంశం. అయితే ఈమాత్రం దానికే వెనక్కి వచ్చేస్తారా. కరోనా కేసుల భయమే కాకుండా మరో కారణం కూడా ఉండవచ్చు. ఇప్పటికైతే రైనా తిరిగి రాకపోవచ్చు. ఇక చెన్నైతో కూడా ఆట ముగిసినట్లే’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment