ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ముక్కీ మూలిగి రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పసికూన నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. ఈ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ కాక బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లండ్.. నిన్న లభించిన చిన్నపాటి విజయానికే ఉబ్బితబ్బిబ్బైపోతుంది. నెదర్లాండ్స్‌పై విజయాన్ని ఇంగ్లండ్ అభిమానులు కూడా ఆస్వాధిస్తున్నారు.
ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ వారి ఖుషీకి కారణం వేరే ఉంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అర్హత సాధించాలంటే వరల్డ్‌కప్‌లో టాప్-7లో (లీగ్ దశ మ్యాచ్‌ల తర్వాత) ఉండాలని ఐసీసీ మెలిక పెట్టిన నేపథ్యంలో ఈ గెలుపు ఇంగ్లండ్‌కు అతి ముఖ్యమైంది.
ఇదే ఇంగ్లండ్‌కు, ఆ జట్టు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. నెదర్లాండ్స్‌పై గెలుపుతో ఇంగ్లండ్ ఏడో స్థానానికి వెళ్లడమే కాకుండా మెరుగైన రన్‌రేట్ సాధించి, ఆ స్థానానికి ఢోకా లేకుండా చేసుకుంది. దీంతో ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న వరుస ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించనట్టే.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్.. నెదర్లాండ్స్‌పై కంటితుడుపు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు బెన్ స్టోక్స్ సెంచరీతో (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. మలాన్ (87), క్రిస్ వోక్స్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ ఛేదనలో చేతులెత్తేసి ఓటమిపాలైంది. ఆ జట్టు 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్ అలీ (3/42), ఆదిల్ రషీద్ (3/54) నెదర్లాండ్స్‌ను దెబ్బకొట్టారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment