వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఆరె వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు.
కాగా, ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 1.3 లక్షల మంది ప్రేక్షకులను (ఫైనల్‌కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య) సైలెంట్‌గా ఉంచడంలో దొరకే సంతృప్తి ఇంకొక దాంట్లో దొరకదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. అన్నట్లుగానే కమిన్స్ నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించి నరేంద్ర మోదీ స్టేడియం మొత్తాన్ని సైలెంట్‌గా ఉంచగలిగాడు. కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. నిశబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా అనే సినిమా డైలాగ్‌తో కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment