వరల్డ్‌కప్-2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి, అజేయ జట్టుగా (6 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) నిలిచింది. లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్‌కు అతి చేరువలోకి వెళ్లింది.
భారత్ చేతిలో ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ టోర్నీలో ఐదో పరాజయాన్ని (6 మ్యాచ్‌ల్లో) మూటగట్టుకుని, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది (అనధికారికంగా).
కాగా, కఠినమైన పిచ్‌పై 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 129 పరుగులకే ఆలౌటై 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
భారత బౌలర్లలో ముఖ్యంగా పేసర్లు బుమ్రా (6.5-1-32-3), షమీ (7-2-22-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరికి కుల్దీప్ యాదవ్ (8-0-24-2), రవీంద్ర జడేజా (7-1-16-1) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. భారత బౌలర్లలో సిరాజ్ మినహా అందరికీ వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment