CWC 2023 IND VS NZ Semi Final: టాస్‌ 'ఫిక్స్‌'..? | Sakshi
Sakshi News home page

IND VS NZ Semi Final: టాస్‌ 'ఫిక్స్‌' అయ్యింది.. టీమిండియా గెలుపుపై పాకిస్తానీల అక్కసు

Published Thu, Nov 16 2023 10:57 AM

CWC 2023: Pakistan Fans Accuses That India VS New Zealand Semi Final Match Toss Got Fixed - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్‌ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్‌ (66 బంతుల్లో 80 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్‌ చివరి వరకు గెలుపు కోసం ‍ప్రయత్నించి విఫలమైంది. డారిల్‌ మిచెల్‌ (134), విలియమ్సన్‌ (69), గ్లెన్‌ ఫిలిప్స్‌ (41) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది.  

కాగా, కివీస్‌పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్‌కు చేరడాన్ని పాకిస్తాన్‌ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్‌మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్‌ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్‌ అత్యంత కీలకమైన టాస్‌ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. 

భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌ టాస్‌ ఫిక్సింగ్‌ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్‌ టాస్‌ గెలవాలని ముందుగానే డిసైడ్‌ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

ఓ పాక్‌ అభిమాని టాస్‌కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్‌ శర్మ టాస్‌ ఎగరేస్తాడని, హిట్‌మ్యాన్‌ టాస్‌ కాయిన్‌ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్‌ టాస్‌ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్‌ విలియమ్సన్‌ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement