వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం | IPL 2024: Dale Steyn Dumfounded At LSG Mayank Yadav Record IPL 2024 Delivery - Sakshi
Sakshi News home page

మాటల్లేవ్‌.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్‌కు వార్నింగ్‌ ఇచ్చేశా!

Published Sun, Mar 31 2024 12:51 PM | Last Updated on Sun, Mar 31 2024 2:22 PM

Dale Steyn Dumfounded at LSG Mayank Yadav Record IPL 2024 Delivery - Sakshi

ఐపీఎల్‌ తాజా సంచలనం మయాంక్‌ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌.. మయాంక్‌ పేస్‌ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. 

వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై కూడా మయాంక్‌ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్‌బౌలర్‌గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

అంతేగాకుండా త్వరలోనే మయాంక్‌ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్‌లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్‌ స్మిత్‌కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్‌ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ సైతం మయాంక్‌ యాదవ్‌ సూపర్‌ఫాస్ట్‌ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు.

‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్‌ యాదవ్‌.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్‌ వేదికగా మయాంక్‌ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున 21 ఏళ్ల మయాంక్‌ యాదవ్‌ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఫాస్టెస్ట్‌ డెలివరీని నమోదు చేశాడు.

తన నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్‌పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మయాంక్‌ యాదవ్‌ దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. తాజాగా పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది.

చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్‌ బౌలర్‌ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement