రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్న ఆసీస్‌ ఆల్‌రౌండర్‌.. 41 ఏళ్ల వయసులో రీఎంట్రీ | Dan Christian, 41 Comes Out Of Retirement In BBL | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్న ఆసీస్‌ ఆల్‌రౌండర్‌.. 41 ఏళ్ల వయసులో రీఎంట్రీ

Published Mon, Jan 6 2025 2:49 PM | Last Updated on Mon, Jan 6 2025 2:59 PM

Dan Christian, 41 Comes Out Of Retirement In BBL

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో క్రిస్టియన్‌ సిడ్నీ థండర్‌ తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం క్రిస్టియన్‌ థండర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయాలతో సతమతమవుతున్న థండర్‌ను ఆదుకునేందుకు క్రిస్టియన్‌ బరిలోకి దిగనున్నాడు. థండర్‌ ఆటగాళ్లు డేనియల్‌ సామ్స్‌, కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ కొద్ది రోజుల కిందట మైదానంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

క్యాచ్‌ పట్టబోయి సామ్స్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఒకరినొకరు ప్రమాదకర రీతిలో గుద్దుకున్నాడు. సామ్స్‌ను మైదానం నుంచి స్ట్రెచర్‌పై మోసుకుపోయి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. బాన్‌క్రాఫ్ట్‌ ముక్కు పగిలి రక్త కారడంతో పాటు భుజానికి ఫ్రాక్చర్‌ అయ్యింది. అప్పటికే థండర్‌ గాయాల సమస్యతో బాధపడుతుంది. జేసన్‌ సంఘా, తన్వీర్‌ సంఘా, నిక్‌ మాడిసన్‌ గాయాల కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో థండర్‌కు వేరే అప్షన్‌ లేక క్రిస్టియన్‌ను బరిలోకి దిగమని కోరింది. థండర్‌ యాజమాన్యం​ కోరిక మేరకు క్రిస్టియన్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. థండర్‌ జట్టుకు ఆటగాళ్ల కొరత ఉంది. సామ్‌ కొన్‌స్టాస్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు వెళ్లాడు. త్వరలో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, లోకీ ఫెర్గూసన్‌ కూడా జట్టును వీడనున్నారు. వీరిద్దరూ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ ఆడేందుకు వెళ్తారు. ఎనిమిది మంది ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో క్రిస్టియన్‌ బరిలోకి దిగాల్సి వస్తుంది.

41 ఏళ్ల క్రిస్టియన్‌ రెండేళ్ల కిందట రిటైర్మెంట్‌ ప్రకటించాడు. క్రిస్టియన్‌ చివరిగా సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రిటైర్మెంట్‌ అనంతరం క్రిస్టియన్‌ సిడ్నీ థండర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరున్న క్రిస్టియన్ ఓవరాల్‌గా 409 టీ20లు ఆడాడు. క్రిస్టియన్‌ ఆసీస్‌ తరఫున 43 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన క్రిస్టియన్‌ బీబీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున మూడు టైటిల్స్‌ (బ్రిస్బేన్‌ హీట్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, సిడ్నీ సిక్సర్స్‌) సాధించాడు. క్రిస్టియన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో 121 మ్యాచ్‌లు ఆడి 2009 పరుగులు.. 89 వికెట్లు తీశాడు.

క్రిస్టియన్‌ ఇవాళ జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. సిడ్నీ థండర్‌ ఇవాళ బ్రిస్బేన్‌ హీట్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో థండర్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. ఆ జట్టు 13 ఓవర్లలో 115 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌ (44), క్రిస్‌ గ్రీన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్రిస్బేన్‌ హీట్‌ బౌలర్లలో మైఖేల్‌ నెసర్‌, మాథ్యూ కున్నేమన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్‌ జాన్సన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement