చరిత్ర సృష్టించిన డేవిడ్‌ మిల్లర్‌ | David Miller Is The First South African To Score 11000 T20 Runs | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన డేవిడ్‌ మిల్లర్‌

Published Sun, Jan 19 2025 2:46 PM | Last Updated on Sun, Jan 19 2025 3:50 PM

David Miller Is The First South African To Score 11000 T20 Runs

సౌతా​ఫ్రికా మిడిలార్డర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో మిల్లర్‌ ఈ మైలురాయిని తాకాడు. 

ఈ మ్యాచ్‌లో మిల్లర్‌ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్‌ తన ఓవరాల్‌ టీ20 కెరీర్‌లో 468 ఇన్నింగ్స్‌లు ఆడి 11,046 పరుగులు చేశాడు.

మిల్లర్‌ 11000 టీ20 రన్స్‌ క్లబ్‌లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్‌ ఈ క్లబ్‌లో  చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్‌ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్‌ 376 ఇన్నింగ్స్‌ల తన టీ20 కెరీర్‌లో 11,042 పరుగులు చేశాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..
డేవిడ్‌ మిల్లర్‌-11046
డుప్లెసిస్‌-11042
డికాక్‌-10620
ఏబీ డివిలియర్స్‌-9424
రిలీ రొస్సో-9067

నిన్న జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై పార్ల్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. విల్‌ స్మీడ్‌ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్‌ వెర్రిన్‌ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్‌ నీషమ్‌ (13 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్యాపిటల్స్‌ ఆటగాళ్లలో విల్‌ జాక్స్‌ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.

213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఇన్‌ఫామ్‌ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్‌ డకౌట్‌ కాగా.. జో రూట్‌ (60 బంతుల్లో 92 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్‌ హెర్మన్‌ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (24 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.

మరో మ్యాచ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.

ఛేదనలో ర్యాన్‌ రికెల్టన్‌ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌), రీజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement