హహహ.. నా వెంట 87 శాతం ఇండియన్స్‌: వార్నర్‌ | David Warner Thanks Indians 5M Instagram Followers | Sakshi
Sakshi News home page

5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్‌

Published Mon, Dec 14 2020 6:13 PM | Last Updated on Mon, Dec 14 2020 9:08 PM

David Warner Thanks Indians 5M Instagram Followers - Sakshi

సిడ్నీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ద్వారా చాలా మంది భారతీయులకు ప్రియమైన ఆటగాడిగా మారాడు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సారథ్యం వహించిన అతడు లక్షలాది మంది అభిమానం చూరగొన్నాడు. ముఖ్యంగా ఆరెంజ్‌ ఆర్మీ వార్నర్‌ను హైదరాబాదీ, మా అన్న అని, అతడి భార్య కాండిస్‌ వార్నర్‌ను వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. అంతేగాక వార్నర్‌ దంపతుల పిల్లల అల్లరిని ఎంజాయ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వారి వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తూ ప్రేమను కురిపిస్తారు. ఇక లాక్‌డౌన్‌లో ఆటకు విరామం దొరకడంతో వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైన సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా అల్లు అర్జున్‌ బుట్టబొమ్మ, మహేష్‌ బాబు మైండ్‌బ్లాక్‌ పాటలతో పాటు పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. వార్నర్‌తో పాటు అతడి భార్యా, పిల్లలు కూడా పలు తమిళ, హిందీ సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ అలరించారు. వార్నర్‌ కుటుంబానికి ఫిదా అయిన భారతీయ నెటిజన్లు లైకులు, షేర్లతో వారిని ఉత్సాహపరిచారు. ఇక డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఓ ఇండియన్‌ నెటిజన్‌.. ‘తెరి’ సినిమా(తమిళ) బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో  ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించాడు.(చదవండి: నిన్ను ద్వేషించేందుకు ఒక్క కారణం చెప్పు.. వార్నర్‌!)

ఇందుకు స్పందనగా.. ‘‘నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి సదా రుణపడి ఉంటాను. మీ కామెంట్లు, ఫీడ్‌బ్యాక్‌ నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఎల్లప్పుడూ నేనిలాగే మీ ముఖాలపై చిరునవ్వులు చిందేలా నా వంతు కృషి చేస్తా. ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు హర్షద్‌ గైక్వాడ్‌’’ అంటూ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పోస్టు ఇప్పటికే 7 లక్షలకు పైగా లైకులు రాగా.. మనీశ్వర్‌ రెడ్డి అనే ఓ యూజర్‌.. ‘‘ మీ ఫాలోవర్లలో కనీసం 50 శాతం మంది ఇండియన్స్‌ ఉంటారు కదా’’అని కామెంట్‌ చేయగా.. ‘‘నిజానికి 87 శాతం.. హహా’’ అంటూ వార్నర్‌ బదులిచ్చాడు. ఇక గాయం కారణంగా టీమిండియాతో జరిగిన చివరి వన్డే, టీ20 సిరీస్‌కు వార్నర్‌ దూరమైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement