Ind vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్‌లకు టీమిండియా పేసర్‌ దూరం? | Deepak Chahar Father Hospitalized Brain Stroke Pacer Likely to Miss South Africa Tour | Sakshi
Sakshi News home page

Ind vs SA: అన్నిటికంటే మా నాన్నే ముఖ్యం.. ద్రవిడ్‌ సర్‌, సెలక్టర్లతో మాట్లాడాను!

Published Wed, Dec 6 2023 2:41 PM | Last Updated on Wed, Dec 6 2023 3:21 PM

Deepak Chahar Father Hospitalized Brain Stroke Pacer Likely to Miss South Africa Tour - Sakshi

కుటుంబంతో దీపక్‌ చహర్‌- టీమిండియా జెర్సీలో చహర్‌(PC: BCCI)

India Tour Of South Africa 2023: టీమిండియా పేసర్‌ దీపక్‌ చహర్‌ సౌతాఫ్రికా పర్యటనలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి.

కాగా గాయాల బెడదతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన రైటార్మ్‌ పేసర్‌ దీపక్‌ చహర్‌.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా పునరాగమనం చేశాడు. కంగారూ జట్టుతో నాలుగో మ్యాచ్‌కు యువ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ గైర్హాజరు కావడంతో అతడి స్థానంలో దీపక్‌ ఎంట్రీ ఇచ్చాడు. 

రాయ్‌పూర్‌ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో కూడా దీపక్‌ చహర్‌ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఆఖరి టీ20కి దూరమయ్యాడని తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు.

తండ్రికి బ్రెయిన్‌స్ట్రోక్‌
తాజాగా ఈ విషయం గురించి దీపక్‌ చహర్‌ స్పందించాడు. తన తండ్రి లోకేంద్ర సింగ్‌ శనివారం(డిసెంబరు 2) బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని.. అందుకే హుటాహుటిన అలీఘర్‌కు బయల్దేరినట్లు తెలిపాడు. ‘‘సరైన సమయానికి మా నాన్నను ఆస్పత్రికి తీసుకురాగలిగాం.

లేదంటే పరిస్థితి విషమించేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అన్నింటికంటే మా నాన్నే నాకు ముఖ్యం.

ఈరోజు క్రికెటర్‌గా నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. మా నాన్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను.

ద్రవిడ్‌ సర్‌, సెలక్టర్లతో మాట్లాడాను
ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి సౌతాఫ్రికాకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌, సెలక్టర్లతో మాట్లాడాను. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని దీపక్‌ చహర్‌ వెల్లడించాడు. 

అయితే, డిసెంబరు 10 నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో దీపక్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో వన్డే, సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని టీ20 జట్టుకు దీపక్‌ చహర్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

వివాహ వేడుకకు వెళ్లి
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల దీపక్‌ చహర్‌ తండ్రి లోకేంద్రసింగ్‌ భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అని సమాచారం. ఆయన బీపీ, షుగర్‌ పేషంట్‌. అలీఘర్‌లో ఓ వివాహ వేడకకు హాజరైన సందర్భంగా పక్షవాతానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు దైనిక్‌ జాగరణ్‌ వివరాలు వెల్లడించింది.

చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌.. సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement