నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా దీప్తికి ముందు ఈ ఘనతను మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు. పాకిస్తాన్‌కు చెందిన నిదా దార్ (1839 పరుగులు, 130 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ (1750 పరుగులు, 123 వికెట్లు), న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ (3107 పరుగులు, 113 వికెట్లు) టీ20ల్లో అరుదైన డబుల్‌ను సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (30) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తితో పాటు రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్‌నర్ ఓ వికెట్ దక్కించుకుంది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 26, బెత్ మూనీ 20, తహిల మెక్‌గ్రాత్ 19, ఎల్లిస్ పెర్రీ 34 నాటౌట్, ఆష్లే గార్డ్‌నర్ 7, లిచ్‌ఫీల్డ్ 18 నాటౌట్ తలో చేయి వేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. బ్యాట్‌తో రాణించిన దీప్తి బంతితోనూ సత్తా చాటింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ నెగ్గగా.. ఆసీస్ రెండో టీ20 గెలిచింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జనవరి 9న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment