
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) హాకీలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకునే సందర్భంలో ఆటగాళ్లు ఫేస్‌గేర్(హెల్మెట్లు) ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే బంతి 23 మీటర్ల దూరం దాటిన తర్వాత ఆటగాళ్లు ఫేస్‌గేర్‌ను తప్పనిసరిగా తొలగించాలని రూల్‌లో పేర్కొంది. అంతకుముందు పెనాల్టీ కార్నర్‌లను డిఫెండ్ చేసే ఆటగాళ్ళు బంతి ఫ్లిక్ అయిన వెంటనే సర్కిల్ లోపలే ఫేస్‌గేర్‌ను తీసేయాల్సి ఉండేది. తాజాగా హాకీ నిబంధనలోని రూల్ 4.2 ప్రకారం నిబంధనను సవరించినట్లు హాకీ ఫెడరేషన్ సంఘం ట్విటర్‌లో పేర్కొంది.
కాగా డిసెంబర్ 2021లో భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ హాకీ మెన్స్ వరల్డ్‌కప్‌లో పెనాల్టీ కార్నర్ రూల్‌లో ఆటగాళ్లకు ఫేస్‌గేర్‌ను ట్రయల్‌గా అమలు చేశారు. దీనిపై హాకీ కోచ్‌లు, క్రీడాకారులు, ఇతర అధికారుల నుంచి మంచి ప్రయత్నమంటూ విశేష స్పందన రావడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఈ నిబంధనను కొనసాగిస్తూ తాజాగా అమల్లోకి తెచ్చింది.