బార్టీ, కెనిన్
మెల్‌బోర్న్: ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల డిఫెండింగ్ చాంపియన్ కెనిన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ఇంటి దారి పట్టింది. ఈస్టోనియాకు చెందిన 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ కియా కానెపి 2020 చాంపియన్‌పై సంచలన విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) ముందంజ వేశారు. భారత క్రీడాకారులకు డబుల్స్‌లో చుక్కెదురైంది.
మహిళల్లో మరో సంచలనం
మహిళల సింగిల్స్‌లో నాలుగో రోజు కూడా సంచలన ఫలితం వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరుటి విజేత కెనిన్ ఆట రెండో రౌండ్లోనే ముగిసింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కియా కానెపి వరుస సెట్లలో 6–3, 6–2తో నాలుగో సీడ్ కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. 2007 నుంచి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా... క్వార్టర్స్ చేరని 35 ఏళ్ల కానెపి ఈ సీజన్‌లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం గంటా 4 నిమిషాల్లోనే 22 ఏళ్ల అమెరికా యువ క్రీడాకారిణిని కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 7–6 (9/7)తో తమ దేశానికే చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలొవాపై శ్రమించి నెగ్గింది.
తొలిసెట్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రపంచ నంబర్‌వన్‌కు రెండో సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అనామక ప్లేయర్ డారియా అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతి పాయింట్ కోసం బార్టీకి చెమటోడ్చక తప్పలేదు. హోరాహోరీగా జరిగిన రెండో సెట్ చివరకు టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ కూడా స్వదేశీ ప్రత్యర్థి ఏమాత్రం తగ్గకపోవడంతో టాప్‌సీడ్ సర్వశక్తులు ఒడ్డి గెలిచింది. ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో డానియెల్లా కొలిన్స్ (అమెరికా)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–3తో కొకొ గాఫ్ (అమెరికా)పై అలవోక విజయం సాధించారు. 11వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7–5, 2–6, 6–4తో స్వెత్లానా కుజ్‌నెత్సొవా (రష్యా)పై చెమటోడ్చి గెలిచింది.
నాదల్ జోరు
కెరీర్‌లో 21వ టైటిల్‌పై కన్నేసిన నాదల్ తన జోరు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో స్పానిష్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–2తో క్వాలిఫయర్ మైకేల్ మోహ్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఓ వైల్డ్‌కార్డ్ ప్లేయర్‌పై రెండో రౌండ్ గెలిచేందుకు ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగున్నర గంటల పాటు పోరాడాడు. చివరకు గ్రీస్ ప్లేయర్ 6–7 (5/7), 6–4, 6–1, 6–7 (5/7), 6–4తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు.
నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–2, 7–5, 6–1తో కార్బలెస్ బయెనా (స్పెయిన్)పై, ఏడో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 7–6 (10/8)తో మాంటెరియా (బ్రెజిల్)పై విజయం సాధించగా, తొమ్మిదో సీడ్ మట్టె బెరెటినీ (ఇటలీ) 6–3, 6–2, 4–6, 6–3తో క్వాలిఫయర్ టామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టంమీద గెలిచాడు. 16వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 4–6, 6–2, 2–6, 6–3, 7–6 (14/12) తన దేశానికే చెందిన కరుసోపై సుదీర్ఘ పోరాటం చేసి నెగ్గాడు. సుమారు నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. 28వ సీడ్ క్రాజినొవిక్ (సెర్బియా) 6–2, 5–7, 6–1, 6–4తో పాబ్లో అండ్యుజర్ (స్పెయిన్)పై గెలుపొందాడు.
దివిజ్, అంకిత జోడీలు ఔట్
భారత జోడీలకు సీజన్ ఆరంభ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. స్లోవేకియాకు చెందిన ఇగొర్ జెలెనేతో జతకట్టిన దివిజ్ శరణ్ 1–6, 4–6తో యనిక్ హన్‌ఫన్– కెవిన్ క్రావిజ్ జోడీ చేతిలో ఓడిపోయారు. ఇదివరకే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ద్వయం కూడా కంగుతినడంతో డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల ఈవెంట్లో అంకిత–మిహెల బుజర్నెకు (రుమేనియా) జంట 3–6, 0–6తో ఒలివియా గడెకి–బెలిండా వూల్‌కాక్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment