దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్ ధావన్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్( 53 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్(37; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లు ధాటిగా ఆరంభించారు. పృథ్వీ షా ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా ఆడితే, ధావన్ మాత్రం స్టైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 68 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పృథ్వీ షా ఔటయ్యాడు.
సిరాజ్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా ఔటయ్యాడు. మరో 14 పరుగుల వ్యవధిలో ధావన్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక శ్రేయస్ అయ్యర్(11) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మొయిన్ అలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అయ్యర్‌ను దేవదూత్ అద్భుత క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం రిషభ్ పంత్‌కు జత కలిసిన స్టోయినిస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రధానంగా స్టోయినిస్ క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బౌండరీల మోత మోగించాడు. మొయిన్ అలీ, నవదీప్ సైనీలపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. కాగా, చివరి ఓవర్‌లో ఉదాన 12 పరుగులు ఇవ్వడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు సాధించగా మొయిన్ అలీ, ఉదానాకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment