ప్రస్తుతం తరంలో భారత టెస్టు వికెట్ కీపర్ బ్యాటర్లంటే మనకు టక్కున గుర్తు వచ్చేది డాషింగ్ ఆటగాడు రిషబ్ పంత్‌నే. ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ప్రత్యర్ధి బౌలర్ ఎంత మొనగాడైనా ఊచకోత కోయడమే అతడి నైజం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై మూడు చెరువుల నీరు తాగించిన ఘనత ఈ ఢిల్లీ చిచ్చర పిడుగుది.
కానీ ఇదంతా 2022 ఏడాదికి ముందు. ఆ తర్వాత కథ వేరు. 2022 ఏడాదిలో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ మెరుపులను టీమిండియా మిస్స్ అయ్యింది. ఎంతమంది వికెట్ల కీపర్లను మార్చినా అతడి లోటును ఎవరూ తీర్చలేకపోయారు. పంత్ రీ ఎంట్రీ వెయ్యికళ్లుతో ఎదురుచూస్తున్న తరుణంలో అతడినే మైమరిపించేలా ఒక యువ సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. అతడే ఉత్తర్ ప్రదేశ్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్
అరంగేట్రంలోనే అదుర్స్..
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల దృవ్ జురల్ అడుగుపెట్టాడు. తన కంటే సీనియర్ అయిన శ్రీకర్ భరత్‌ను కాదని జురల్‌కు మేనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. మేనెజ్‌మెంట్ నమ్మకాన్ని దృవ్ వమ్ముచేయలేదు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 46 పరుగులు చేసిన ఈ యూపీ ఆటగాడు.
వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సెంచరీ హీరో బెన్ డకెట్‌ను దృవ్ రనౌట్ చేసిన విధానం కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అదే విధంగా కుల్దీప్, అశ్విన్, జడ్డూ వంటి వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్‌ను వికెట్ల వెనుక అతడు ఎదుర్కొన్న విధానం అద్బుతం.
ఈ క్రమంలో రిషబ్ పంత్ వారసుడు దొరికేశాని అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. పంత్ ప్రస్తుతం శరవేగంతో కోలుకుంటున్నప్పటికీ భారత జట్టులోకి రీ ఎంట్రీకి మరి కొంత సమయం పడుతుంది. ఒక వేళ వచ్చినా గానీ వికెట్ కీపింగ్ చేయగలడన్నది అనుమానమే.
భరత్ కథ ముగిసినట్లేనా..?
శ్రీకర్ భరత్.. రిషబ్ పంత్ వారసుడిగా భారత టెస్టుక్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఈ ఆంధ్ర ఆటగాడు విఫలమయ్యాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది.
అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ క్రమంలో జురల్ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టడంతో భరత్‌కు ఇకపై జట్టులో చోటు కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment