Did You Know When-Rohit Sharma-Batted at No 7 Last Time - Sakshi
Sakshi News home page

రోహిత్‌ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే?

Published Fri, Jul 28 2023 7:44 PM | Last Updated on Fri, Jul 28 2023 7:55 PM

Did You Know When-Rohit Sharma-Batted At No 7 Last Time - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. వన్డే, టెస్టులు, టి20లు ఇలా ఏదైనా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సెహ్వాగ్‌ తర్వాత ఓపెనింగ్‌లో విధ్వంసం సృష్టించగల బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రోహిత్‌ వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఓపెనింగ్ చేయకుండా ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లను ఓపెనింగ్ పంపించారు. ఇక మూడో స్థానంలో రావాల్సిన కోహ్లి కూడా బ్యాటింగ్‌కు రాలేదు. వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ బలమెంత అనేది తెలుసుకోవడంతో పాటు వన్డే స్పెషలిస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఇలా ప్లాన్‌ చేసినట్లు రోహిత్‌ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

ఇప్పుడంటే ఓపెనింగ్‌ బ్యాటర్‌గా వస్తున్న రోహిత్‌ కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు.  చివరిసారి 2011 జనవరిలో సౌతాఫ్రికాతో వన్డేలో ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఇక మ్యాచ్‌ అనంతరం రోహిత్‌  ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. కొస మెరుపు ఏంటంటే అదే ఏడాది ఏప్రిల్లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. కానీ రోహిత్‌ ఆ వరల్డ్‌కప్‌కు ఎంపిక కాలేదు.

"టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పుడు ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. తాజాగా విండీస్‌తో తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ద్వారా మళ్లీ నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. 2011 నాకు అసలు కలిసి రాలేదు. వరల్డ్ కప్ జట్టులో నేను లేను.దానికి నన్ను నేనే నిందించుకోవాలి. నేను నా ఆటపై దృష్టి సారించాను. యోగా, మెడిటేషన్, ఒంటరిగా ఉండటం నాకు చాలా సాయం చేశాయి. నేను మారాల్సిన అవసరం ఉందని ఒకవేళ నేను మెరుగవ్వకపోతే మళ్లీ క్రికెట్ ఆడలేను అన్న విషయం అర్థమైంది. 2014-15 మధ్య నేను చాలా మారాను. లేదంటే నేను కొనసాగలేనన్న విషయం నాకు అర్థమైంది" అని రోహిత్ అన్నాడు.

ఇక తొలి వన్డేలో ఇండియా 5 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 29న(శనివారం) బార్బడోస్‌ వేదికగా జరగనుంది. 

చదవండి: Major League Cricket 2023: డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఫైనల్లో సీటెల్‌ ఓర్కాస్

బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement