3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్‌లో హార్ధిక్ వ్యూహాలను ఎండగట్టిన కనేరియా.. భారత్‌ను గెలిపించేందుకు హార్ధిక్ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని, కెప్టెన్‌గా హార్ధిక్ ఘోరంగా వైఫల్యం చెందాడని తన యూట్యూబ్ ఛానల్ వేదికగా నోటికి వచ్చినట్లు వాగాడు.
బౌలర్లను రొటేట్ చేయడంలో దారుణంగా విఫలమైన హార్ధిక్.. చిన్నపిల్లాడిలా తానే మొదట బౌలింగ్ చేయాలన్నట్లుగా బంతి కోసం ఎగబడ్డాడని కనేరియా మండిపడ్డాడు. శివమ్ మావీని లేటుగా బరిలోకి దించడం, దీపక్ హుడాకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం.. ఇలా, ప్రణాళికలేమీ లేకుండా బౌలర్లను మార్చడంపై ధ్వజమెత్తాడు. జట్టును ముందుండి నడిపించడంలో చేతులెత్తేసిన హార్ధిక్.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడని విమర్శించాడు.
మొత్తంగా తొలి టీ20లో హార్ధిక్.. జట్టును ముందుండి నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, కెప్టెన్‌గా అతనికి అంత సీన్ లేదని అర్ధం వచ్చేలా టీమిండియా కెప్టెన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. ఆఖర్లో ఇది వ్యక్తిగత విమర్శ కాదని.. హార్ధిక్ కెప్టెన్సీపై తన అభిప్రాయం మాత్రమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఇదిలా ఉంటే, రోహిత్ సారధ్యంలో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే (హార్ధిక్ నేతృత్వంలో) ఓడింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. ఇవాళ (జనవరి 29) జరుగబోయే రెండో మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ విజయావకాశాలు సజీవంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment