
అబుదాబి: పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ రాహుల్, మయాంక్‌లు ఆడుతున్నంతసేపు మ్యాచ్ కింగ్స్ పంజాబ్ చేతిల్లోనే ఉంది. ఆ సమయంలో మ్యాచ్‌ను మావైపు తిప్పుకోవడానికి ఉన్న వనరులన్నీ ఉపయోగించాం. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా బౌలింగ్ చేశాడు. (గేల్.. నువ్వు త్వరగా కోలుకోవాలి)
ఈ సీజన్‌లో తొలి గేమ్ ఆడుతున్న ప్రసిద్ధ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ప్రత్యేకంగా అతని రెండో స్పెల్‌లో విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక నరైన్ ఎప్పుడూ బాగా అండగా నిలుస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి బ్రేక్‌లు ఇస్తాడు. అయితే ఈ క్రెడిట్ అంతా ఇయాన్ మోర్గాన్, కోచ్ మెకల్లమ్‌కే చెందుతుంది. క్లిష్ట సమయంలో మోర్గాన్ సలహాలు ఉపయోగపడ్డాయి. అదే సమయంలో మెకల్లమ్ చేసిన వర్కౌట్ కూడా ఉపయోగపడింది. జట్టు అవసరాలకు తగ్గట్టు నా బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా ప్రమోట్ చేశాడు. మోర్గాన్, మెకల్లమ్‌లు మా జట్టులో ఉండటం నా అదృష్టం. వీరిద్దరూ వరల్డ్ అత్యుత్తమ కెప్టెన్లు. టీ20 స్పెషలిస్టులు. కింగ్స్ పంజాబ్‌పై విజయంలో వీరి పాత్ర వెలకట్టలేనిది. ప్రత్యేకంగా వీరిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment