అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం? | 'You Don't Give Up On Family When They Fall': Virat Kohli's Sister Post Who Are Real Fans - Sakshi
Sakshi News home page

CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం?

Published Tue, Nov 21 2023 8:14 PM | Last Updated on Wed, Nov 22 2023 7:27 PM

Dont Give Up On Family When They Fall: Virat Kohli Sister Post Who Are Real Fans - Sakshi

‘‘మనం ఊహించిన ఫలితం వేరు.. కానీ జరిగింది వేరు.. అయినా మనమంతా టీమిండియా వెంటే ఉంటాం.. కుటుంబంలోని సభ్యులు ఎవరైనా బాధతో కుంగిపోయినపుడు.. మనం వాళ్లను వదిలేయం కదా! 

నిజానికి అలాంటపుడే మనం వాళ్లకు మరింత మద్దతుగా నిలవాలి’’- వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో భారత జట్టు ఓటమి తర్వాత తన తమ్ముడు విరాట్‌ కోహ్లిని అనునయిస్తూ భావనా కోహ్లి ధింగ్రా సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న భావాలు..

అవును భావనా అన్న మాటలు అక్షరాలా నిజం.. అన్నీ సజావుగా సాగుతూ.. ఉన్నత స్థితిలో ఉన్నపుడు మనోళ్లు అంటూ ప్రశంసించడం కంటే.. కష్టాల్లో ఉన్నపుడు అండగా ఉంటేనే ఏ బంధానికైనా విలువ ఉంటుంది. 

భారీ అంచనాలు
ఇప్పుడు ఈ విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత భారత క్రికెట్‌ జట్టు అభిమానులపై ఉంది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ అనగానే దేశమంతా సరికొత్త ఉత్సాహం.. క్రికెట్‌ను కేవలం ఆటలా కాకుండా ఓ ‘మతం’లా భావించే భారతీయులకు నిజంగా ఇది పండుగ లాంటిదే. మొదటి నుంచీ భారీ అంచనాలు.. ఈసారి కప్పు మనదేనంటూ జోస్యాలు.. 

అక్టోబరు 5న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ పోరుతో ఈ మెగా క్రికె​ట్‌ సమరానికి తెర లేచింది. ఆ తర్వాతి మూడు రోజులకు ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా టీమిండియా తొలి మ్యాచ్‌.. నాడు రోహిత్‌ సేన ఛేదించాల్సిన లక్ష్యం 200..

కష్టమ్మీద వచ్చిన గెలుపుతో ఆరంభం
చిన్న టార్గెట్‌ ఈజీగానే కొట్టేస్తారు అనుకున్నారంతా! కానీ ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌.. వన్‌డౌన్లో వచ్చిన కోహ్లికి శ్రేయస్‌ అయ్యర్‌ తోడుంటానుకుంటే అతడూ సున్నా చుట్టి పెవిలియన్‌ చేరాడు.

అప్పుడొచ్చాడు కేఎల్‌ రాహుల్‌.. కోహ్లితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రన్‌మెషీన్‌ 85 పరుగులు సాధిస్తే.. రాహుల్‌ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. 41.2 ఓవర్‌ వద్ద సిక్సర్‌తో లక్ష్యాన్ని ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

చెన్నై నుంచి ముంబై దాకా టాప్‌ గేర్‌
ఒకవేళ ఆరోజు కోహ్లి, రాహుల్‌ పట్టుదలగా నిలబడి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. అలా అతి కష్టమ్మీద తొలి మ్యాచ్‌ తర్వాత.. టీమిండియా గేర్‌ మార్చింది. చెన్నైలో మొదలుపెట్టిన విజయ ప్రస్థానాన్ని ముంబై దాకా అప్రతిహతంగా కొనసాగించింది.

లీగ్‌ దశలో ఆస్ట్రేలియా తర్వాత అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌లపై వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో ఓడించి అతిపెద్ద గెలుపు నమోదు చేసింది.

సెమీస్‌ గండాన్నీ దాటేసి..
ఆ తర్వాత తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ రూపంలో ఎదురైన గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది టీమిండియా. ఇక అప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

దేశవ్యాప్తంగా పూజలు
అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ ట్రోఫీ అందుకోవడం ఖాయమని ఫిక్సైపోయారు అభిమానులు. అంతటితో ఆగిపోలేదు.. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవాలంటే ఆటతో పాటు సెంటిమెంట్లు కూడా కలిసిరావాలి.. పూజలు, ప్రార్థనలు చేయాలి..

ఉపవాసాలు ఉండాలి.. ఏం చేసినా ఏదేమైనా కప్పు మనదేనన్న విషయం మాత్రం మర్చిపోకూడదు.. ఇలా దేశమంతా అభిమానులు ఒక్కటై సోషల్‌ మీడియాలోనే కాదు.. బయట కూడా తమ ఆకాంక్షలను పెద్ద ఎత్తున చాటారు.

మనోళ్లు గెలవాలన్న తాపత్రయమే ఇదంతా.. కానీ
నిజానికి ఇదంతా.. జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ.. సానుకూల దృక్పథంతో ఉండటంలో భాగమే! కానీ ఎంత కాదనుకున్నా.. బయటి విషయాలు పట్టించుకోమని చెబుతున్నా.. కచ్చితంగా ఆటగాళ్లపై ఇవన్నీ ప్రభావం చూపుతాయి.

ఈ ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు ఎంతో మంది క్రికెట్‌ దిగ్గజాలు కూడా చెప్పిన మాట ఇదే... ఈసారి టైటిల్‌ ఫేవరెట్‌ టీమిండియానే.. కానీ సొంతగడ్డపై ఆడటం వారికి ఎంత సానుకూలమో.. అంచనాలు, ఆశల వల్ల కలిగే ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది..

అందుకు తగ్గట్లుగానే.. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య.. నీలి సంద్రాన్ని తలపించే స్టేడియంలో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టుపై ఆ ప్రభావం పడింది. 

మనోళ్లు సిక్స్‌ కొడితే ప్రేక్షకుల ఉత్సాహంతో హోరెత్తిపోయిన స్టేడియం.. ఒక్క వికెట్‌ పడితే అంతకంటే నిశ్శబ్దంగా మారిపోయింది. మైదానంలో దిగిన ఆటగాళ్లకు ఈ ఒక్క మార్పు చాలు అభిమానుల మనఃస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి!

ఎలాగైనా పవర్‌ ప్లేలో పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్‌ పారేసుకున్నాడు రోహిత్‌.. తొలి వరల్డ్‌కప్‌ ఆడుతున్న మరో ఓపెనర్‌, యువ బ్యాటర్‌ గిల్‌ అప్పటికే పెవిలియన్‌ చేరాడు.

కోహ్లితో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ నిర్మిస్తాడనుకుంటే ఆ ఆశ కూడా పోయింది. అంతకు ముందు వరుస శతకాలు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. 

తొలి మ్యాచ్‌ మాదిరే.. మరోసారి అదే ప్రత్యర్థిపై కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ కచ్చితంగా వీరబాదుడు బాదుతారని అభిమానుల నమ్మకం.. కానీ ఆసీస్‌ పేసర్ల బంతులు మన ఆశల కంటే పదునైనవి కదా..

ఎంత జాగ్రత్తగా ఆడుతున్నా కీలక సమయంలో కోహ్లిని ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ అనూహ్య రీతిలో వెనక్కి పంపితే.. బాధ్యతగా ఆడుతున్న రాహుల్‌ను మిచెల్‌ స్టార్క్‌ అవుట్‌ చేశాడు. అంతే.. మన బ్యాటిం​గ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. 240 పరుగులకే కథ ముగిసింది.

స్టేడియంలో మరోసారి నిశ్శబ్దం.. అయితే, మన పేస్‌ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్‌పై అంతే నమ్మకం కూడా! ఎలాగైనా గెలిచేస్తాం.. కప్పు మనదే.. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి.. ఓపెనర్‌ వార్నర్‌ క్యాచ్‌ పట్టగానే ఎగిరి గంతేసిన ఫ్యాన్స్‌ ఆనందాన్ని ట్రవిస్‌ హెడ్‌ ఎంతో సేపు నిలవనీయలేదు.

లబుషేన్‌తో కలిసి క్రీజులో పాతుకుపోయి 137 పరుగులు చేసి మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. లబుషేన్‌ ఆఖరి వరకు అజేయ అర్ధ శతకంలో నిలవగా.. ఈ టోర్నీలో ద్విశతక వీరుడైన మాక్స్‌వెల్‌ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతే.. ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దం.. అంతా మనవల్లేనేమోనన్న పశ్చాత్తాపం కొందరిలో! అవును.. బ్యాటింగ్‌ చేస్తున్నపుడు.. ఫీల్డింగ్‌ చేస్తున్నపుడు మన వాళ్ల తత్తరబాటు చూస్తే నిజమే అనిపించింది. 

మరోవైపు.. ఆస్ట్రేలియా జట్టు.. లక్ష మందికి పైగా.. ప్రత్యక్షంగా ప్రత్యర్థికి మద్దతుగా.. తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్న చోట.. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో.. పిచ్‌ నుంచి సహకారం లభించక తిప్పలు పడుతున్న ప్రత్యర్థి బౌలింగ్‌లో.. చాలా సింపుల్‌గా.. ఏదో ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచ్‌ ఆడుతుందా అన్నట్లుగా అలా అలా ముందుకు సాగి.. ఏకంగా ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది.

ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తమ వ్యూహాలు, ప్రణాళికలు పక్కాగా అమలు చేసి.. తాము కంగారు పడే వాళ్లం కాదు.. కంగారు పెట్టేవాళ్లమని మరోసారి నిరూపించింది. అంతే అక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే పొరపాటే!

ఎందుకీ విద్వేష విషం?
కొందరు ‘దురభిమానులు’.. వాళ్ల ఐడెంటిటీని వ్యక్తపరిచే ధైర్యం లేని వ్యక్తులు.. తమ వ్యాఖ్యలకు ‘టీమిండియా ఫ్యాన్స్‌’ను బాధ్యులను చేస్తూ.. ఆసీస్‌ క్రికెటర్లు, వారి కుటుంబాలపై విద్వేష విషం చిమ్మారు. మనోళ్ల తప్పులు ఎంచుతూనే.. ప్రత్యర్థి జట్టును కూడా దారుణంగా.. అసభ్యకరరీతిలో అవమానించారు.

షమీకి మద్దతుగా ఉన్నందుకు కోహ్లి కుటుంబాన్ని టార్గెట్‌ చేసినట్లుగా ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్‌ పేరిట నిజమైన అభిమానులకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు.

నిజమైన అభిమానులంటే?
అవును.. నిజమైన అభిమానులు ఎవరు?? అత్యధిక పరుగుల వీరుడు కోహ్లి నిరాశతో కళ్ల నిండా నీళ్లు నింపుకొంటే.. తాము కన్నీటి ధారలు కురిపించేవాళ్లు.. ఇక్కడిదాకా వచ్చి.. ఇప్పుడుకాక.. ఇంకెప్పుడూ లేదని ముఖం దాచుకున్న రోహిత్‌ను చూసి కళ్లను నీటి చెమ్మతో తడిచేసుకునే వాళ్లు..

సిరాజ్‌ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే.. రాహుల్‌ తల నేలకేసి నిట్టూరుస్తుంటే అయ్యో ఆటలో ఇవన్నీ భాగమే.. బాధపడొద్దు అని దూరం నుంచే నచ్చజెప్పే వాళ్లు.. వీటన్నిటికీ మించి..

గెలుపోటములు సహజం అంటూ ప్రత్యర్థి జట్టు విజయాన్ని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వం ఉన్నవాళ్లు.. అని చెప్పొచ్చేమో బహుశా!! మీరేమంటారు!? అభిమానానికి ఇదీ ఓ నిర్వచనం లాంటిదనుకుంటే అందులో నేనూ ఉంటాను!!
-ఇట్లు
టీమిండియా ఫ్యాన్‌.. ఎస్వీ!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement