నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్‌ | Ajit Agarkar Opens Up About the Difficult Conversations Behind Team Selection, Says I Still Haven’t Found The Perfect Way To Say No | Sakshi
Sakshi News home page

గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్‌

May 31 2026 4:20 PM | Updated on May 31 2026 5:57 PM

Dont put me on spot: Agarkar Reacts quizzed on BCCI selection secrets

టీమిండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా అజిత్‌ అగార్కర్‌ వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ విషయంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుందనేది బహిరంగ రహస్యమే.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ను గెలిపించిన తర్వాత.. మరుసటి సిరీస్‌ నుంచే రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక సంజూ శాంసన్‌ను కాదని.. టెస్టు, వన్డే జట్ల సారథి శుబ్‌మన్‌ గిల్‌ను టీ20 ఓపెనర్‌గా దించి నాయకత్వ బృందం భారీ మూల్యమే చెల్లించింది.

గిల్‌పై వేటు వేసి.. 
అయితే, పొరపాటును గ్రహించిన అగార్కర్‌ బృందం.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. గిల్‌పై వేటు వేసి.. ఇషాన్‌ కిషన్‌ను ప్రపంచకప్‌ జట్టులో కొనసాగించింది. ఇక స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్‌ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ టోర్నీలో నాకౌట్‌ మ్యాచ్‌లలో గొప్పగా రాణించిన ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (97*, 89, 89) ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఏదేమైనా.. ఏ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించినా అగార్కర్‌పై విమర్శలు రావడం సహజమే. ఈ విషయం గురించి అతడు తాజాగా స్పందించాడు.

ముంబైలో శనివారం జరిగిన క్రిక్‌ఇన్ఫో అవార్డు ప్రదానోత్సవానికి అగార్కర్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రజెంటర్‌ డానిష్‌ సైట్‌ (ఆర్సీబీ మిస్టర్‌ నాగ్స్‌గా పాపులర్‌) అతడిని తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు.

ప్రజెంటర్‌: ‘అబ్బ.. ఎంత గొప్ప జట్టును ఎంపిక చేశానో’ అని మీరు మురిపిసోయిన సందర్భాలు ఉన్నాయా?
అగార్కర్‌ (నవ్వుతూ): నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా వక్రీకరిస్తారు!.. ఏదేమైనా జట్టు గెలిచిన సందర్భంలో.. ఆ క్షణంలో నాకు గర్వంగానే ఉంటుంది. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మంచి జట్టును ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉంటుంది.

ప్రజెంటర్‌: మన దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. క్రికెట్‌ అభిమానుల దృష్టి మీపైనే ఉంటుంది. మరి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వలేనప్పుడు.. ‘సారీ మ్యాన్‌.. ఈసారి కాదు గానీ.. మళ్లీ వచ్చే సిరీస్‌కు చూద్దాంలే’ అని మీరు అతడికి చెప్పగలరా? ఇందుకు మీరు ఎలాంటి మార్గం ఎంచుకుంటారు?
అగార్కర్‌ (గట్టిగా నవ్వేస్తూ): ఇప్పటికీ నో చెప్పేందుకు నాకు సరైన దారి దొరకలేదు. ఇది రోజూవారీ ప్రక్రియ. ఎప్పటికప్పుడు మెరుగుపడాల్సి ఉంటుంది.

ప్రజెంటర్‌: మరి అందులో మీరు వినూత్నంగా కనుక్కున్న దారి ఏమైనా ఉందా?
అగార్కర్‌: దయచేసి నన్ను ఇరకాటంలో పెట్టొద్దు. త్వరలోనే మేము మరో జట్టును ఎంపిక చేయాల్సి ఉంది అంటూ నవ్వులు పూయించాడు.

చదవండి: ‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’

Advertisement
 
Advertisement
Advertisement