ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.
అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది.
విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..
ఫలితంగా కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్‌ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.
నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నా
ఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం.
అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్‌గా ఉండాలని చెబుతాను.
గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్‌గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను.
అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్‌తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ
Comments
Please login to add a commentAdd a comment