పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు నిరాకరించడానికి ప్రధాన కారణం అక్కడి అభద్రతా భావం. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని భయపడే సంఘటనలు చాలానే ఉన్నాయి. 2009లో పాకిస్తాన్ లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ద్వారా పాక్ గడ్డపై క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. ఇక భారత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇదిలా ఉంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఒప్పుకుంది. మూడు వన్డేలు.. మూడు టి20 మ్యాచ్‌లు లాహోర్ వేదికగా నిర్వహించారు. అలా పాక్‌లో మొదలైన క్రికెట్ సందడిని ఆ తర్వాత ఆస్ట్రేలియా కంటిన్యూ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే మసీదులో బాంబు పేలడం ఆశ్చర్యపరిచినప్పటికి.. సెక్యూరిటీ భద్రత మధ్య మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ విషయంలో పాకిస్తాన్ భద్రతా చర్యలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రశంసించింది.
ఇక ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టు సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్తాన్ పర్యటనకు రానుంది. అయితే అంతకముందే ఈసీబీ పాక్‌లో భద్రతా ఏ మేరకు ఉందో తెలుసుకోవాలని ఐదుగురితో కూడిన బృందాన్ని జూలై 17న పాకిస్తాన్‌కు పంపనున్నారు. ఆటగాళ్ల కంటే ముందే వెళ్లనున్న బృందం అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నది. ఈ మేరకు పాకిస్తాన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..? భద్రతా లోపాలు తలెత్తకుండా పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకుంది..? టీమ్ హోటల్స్ వంటి తదితర విషయాలను ఈసీబీ బృందం పరిశీలించనుంది. జులై 17న రానున్న బృందంలో ఇద్దరు క్రికెట్ ఆపరేషన్స్ అధికారులు, ఇద్దరు సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్, ఒక అధికార ప్రతినిధి ఉంటారు. వీళ్లు కరాచీ, ముల్తాన్, రావాల్పిండి, లాహోర్ (మ్యాచుల వేదికలు) లలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. దీంతో ఈసీబీ బృందం ఇచ్చే నివేదికపై పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆధారపడి ఉంది.
ఇక దాదాపు ఏడేండ్లు(2015) తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నది. ఈ పర్యటనలో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు మూడు టెస్టులు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ గతేడాదే పాకిస్తాన్ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ గతేడాది సెప్టెంబర్ లో న్యూజిలాండ్ జట్టు రావల్పిండిలో జరగాల్సి ఉన్న వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ పర్యటనను రద్దు చేసుకుని కివీస్ కు వెళ్లిపోయింది. భద్రతా కారణాలను చూపి కివీస్ ఆ పర్యటనను రద్దు చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కూడా షాకిచ్చింది. తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పిన ఈసీబీ.. ఈ సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకుంది. కానీ తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులు ఈసీబీని ఒప్పించి.. పర్యటనకు రావాలని మెప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. పాకిస్తాన్ శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు లంకకు వెళ్లింది. ఆసియాకప్-2022 ముగిసిన తర్వాత పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: Sachin Tendulkar: అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment