యూఏఈని చిత్తు చేసిన పాకిస్తాన్ (PC: ACC X)
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా టీ20 కప్-2024లో పాకిస్తాన్-‘ఎ’ జట్టుకు వరుసగా రెండో విజయం లభించింది. అల్ అమెరత్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ యూఏఈ టీమ్‌ను ఏకంగా 114 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.
పాక్, యూఏఈలపై గెలిచిన భారత్
కాగా ఒమన్ వేదికగా వర్ధమాన టీ20 జట్ల మధ్య ఆసియా కప్ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు సహా పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్-బిలో ఉండగా.. హాంగ్‌కాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ గ్రూప్-ఎలో ఉన్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొంది భారత్ గ్రూప్-బి నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. తాజాగా పాక్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. యూఏఈతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.
కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్
ఓపెనర్లు ఒమైర్ యూసఫ్(11 బంతుల్లో 21), యాసిర్ ఖాన్(13 బంతుల్లో25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు.
మిగతా వాళ్లలో కాసిం అక్రం 23 పరుగులు చేయగా.. హైదర్ అలీ మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 32*) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.
65 పరుగులకే కుప్పకూలిన యూఏఈ
లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే యూఏఈ తడబడింది. ఓపెనర్లు ఆయాన్ష్ శర్మ(8), మయాంక్ రాజేశ్ కుమార్(0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ తానిశ్ సూరి 15 రన్స్ చేశాడు. మిగిలిన ఆటగాళ్లలో వికెట్ కీపర్ సయీద్ హైదర్ షా(12), ధ్రువ్ పరాషర్(1), బాసిల్ హమీద్(4), సంచిత్ శర్మ(0), ముహ్మద్ ఫారూక్(3), అకీఫ్ రాజా(0), ఒమిద్ రెహ్మాన్(0 నాటౌట్) దారుణ ప్రదర్శన కనబరిచారు.
ఇక కెప్టెన్ రాహుల్ చోప్రా చేసిన ఇరవై పరుగులే యూఏఈ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. ఈ క్రమంలో 16.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే యూఏఈ జట్టు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షానవాజ్‌దహాని అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. సూఫియాన్ ముఖీమ్ రెండు, అహ్మద్ దనియాల్, అబ్బాస్ ఆఫ్రిది, అరాఫత్ మిన్హాస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా పాక్ అంతకుముందు ఒమన్‌పై విజయం సాధించింది.
చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
నువ్వేమైనా ‘హ్యాట్రిక్’ హీరోవా? బుద్ధిలేదా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment