దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన కసరత్తులు దాదాపు ముగింపు దశకు వచ్చేశాయి. ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్.. కార్యాచరణను వేగవంతం చేశారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నుంచి ఒక లేఖ అందినట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. తమకు బీసీసీఐ నుంచి మెయిల్ ద్వారా ఒక లేఖ వచ్చిందని ఈసీబీ పేర్కొంది. ‘బీసీసీఐ నుంచి అధికారిక లేఖ అందింది. కానీ భారత ప్రభుత్వం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాం. తుది నిర్ణయం అనేది భారత ప్రభుత్వం ఇచ్చే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని ఈసీబీ సెక్రటరీ ముబాషిర్ ఉస్మానీ తెలిపారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరిగేలా ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్‌ని తయారు చేసిన బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకి కూడా ఈ మేరకు సమాచారమిచ్చి నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. (ఐసీసీ వన్డే సూపర్ లీగ్ వచ్చేసింది..)
వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌కి తాము ఆతిథ్యమిస్తామని రెండు నెలల క్రితమే యూఏఈకి చెందిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రతిపాదనని బీసీసీఐకి పంపింది. కానీ.. సెప్టెంబరు నాటికి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆశించిన బీసీసీఐ అప్పట్లో మౌనంగా ఉండిపోయింది. అయితే.. దేశంలో ఇప్పటికీ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోగా.. మరింతగా చేయి దాటిపోయాయి. దాంతో.. భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసిన బీసీసీఐ... తాజాగా ఈసీబీ ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ లేఖని కూడా ఈసీబీకి పంపింది. కాగా, ఇప్పుడు భారత ప్రభుత్వం అనుమతి మాత్రమే ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం బీసీసీఐ పెద్దలు భారత ప్రభుత్వాన్ని ఒప్పించే పనిలో ఉన్నారనేది కాదనలేని వాస్తవం.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ.. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్‌ల్ని బీసీసీఐ నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఆ అనుభవంతోనే ఈసీబీకి మరో అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావాల్సిన టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఐపీఎల్‌కు మార్గం సుగుమం అయ్యింది. ఒకవేళ ఐపీఎల్ నిర్వహించకపోతే వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి రావడంతో ఈ లీగ్‌ను ఎలాగైనా జరపాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. దాంతోనే టీ20 వరల్డ్‌కప్ వాయిదా అనగానే ఐపీఎల్‌కు ఆగమేఘాలపై కసరత్తులు ముమ్మురం చేసింది.(కోహ్లిని మూడుసార్లు ఔట్ చేసేసరికి..)
Comments
Please login to add a commentAdd a comment