లండన్: న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపుపై కన్నేసింది. 277 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ మరో 61 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (110 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (203 బంతుల్లో 108; 12 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, టామ్ బ్లన్‌డెల్ (198 బంతుల్లో 96; 12 ఫోర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. శనివారం కివీస్ 49 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లు చేజార్చుకుంది. పాట్స్, బ్రాడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment