చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి | ENG VS WI 2nd Test: Fastest Ever Team Fifty In The History Of Test Cricket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి

Published Thu, Jul 18 2024 6:22 PM | Last Updated on Thu, Jul 18 2024 6:28 PM

ENG VS WI 2nd Test: Fastest Ever Team Fifty In The History Of Test Cricket

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. కేవలం 4.2 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన టీమ్‌ ఫిఫ్టి ఇదే. 

గతంలోనూ ఈ రికార్డు ఇంగ్లండ్‌ పేరిటే ఉండింది. 1994లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4.3 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో టాప్‌-3 టీమ్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టిలు ఇంగ్లండ్‌ పేరిటే నమోదై ఉన్నాయి. 2002లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 5 ఓవర్లలో ఫిఫ్టి కొట్టింది. టెస్ట్‌ల్లో ఇది మూడో వేగవంతమైన టీమ్‌ ఫిఫ్టి.

ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్‌ బోథమ్‌ 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌ తరఫున రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ జానీ బెయిర్‌స్టో పేరిట రికార్డై ఉంది. 

2022లో న్యూజిలాండ్‌పై బెయిర్‌స్టో 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డు పాక్‌ మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.

26 ఓవర్లలో 134/2
ఈ మ్యాచ్‌లో డకెట్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌కు పునాది వేసుకుంది. డకెట్‌ ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఇంగ్లండ్‌ తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయినప్పటికీ (జాక్‌ క్రాలే డకౌట్‌).. డకెట్‌, ఓలీ పోప్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్‌ బ్రేక్‌) ఇంగ్లండ్‌ స్కోర్‌ 134/2గా ఉంది. పోప్‌ (47), రూట్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. క్రాలే వికెట్‌ అల్జరీ జోసఫ్‌కు.. డకెట్‌ వికెట్‌ షమార్‌ జోసఫ్‌కు దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement