
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.
కొత్త పాత్రలో ఆండర్సన్
ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.
ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
అప్పటి వరకేనా?
వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్‌హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఇక తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.
వెస్టిండీస్‌లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
Comments
Please login to add a commentAdd a comment