మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి | England Beat Ireland By 4 Wickets In 1st T20I | Sakshi
Sakshi News home page

మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి

Sep 17 2025 9:48 PM | Updated on Sep 17 2025 9:48 PM

England Beat Ireland By 4 Wickets In 1st T20I

అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్‌; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్‌ 17) పసికూన ఐర్లాండ్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సాల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్‌ ఝులిపిస్తూ విధ్వంసం​ సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.

సాల్ట్‌ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్‌ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ అంచనాలకు మించి భారీ స్కోర్‌ చేసింది. హ్యారీ టెక్టార్‌ (36 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్‌ టక్కర్‌ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (34), రాస్‌ అదైర్‌ (26) కూడా సత్తా చాటారు.

ఐరిష్‌ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్‌, డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ మాత్రం తలో వికెట్‌ తీశారు.

197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్‌ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్‌ (10 బంతుల్లో 28), జేకబ్‌ బేతెల్‌ (16 బంతుల్లో 24), సామ్‌ కర్రన్‌ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్‌ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్‌ అహ్మద్‌ 8, టామ్‌ బాంటన్‌ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్‌ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. 

ఐరిష్‌ బౌలర్లలో హంఫ్రేస్‌, హ్యూమ్‌ తలో 2, హ్యారీ టెక్టార్‌, గెరాత్‌ డెలానీ చెరో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 సెప్టెంబర్‌ 19న డబ్లిన్‌లోనే జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement