ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ | England beat South Africa by nine wickets in third mens T20 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

Published Thu, Dec 3 2020 1:16 AM | Last Updated on Thu, Dec 3 2020 1:27 AM

England beat South Africa by nine wickets in third mens T20 - Sakshi

కేప్‌టౌన్‌: వరుసగా మూడో టి20 మ్యాచ్‌లోనూ అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 17.4 ఓవర్లలో కేవలం వికెట్‌ కోల్పోయి ఛేదించింది.

డేవిడ్‌ మలాన్‌ (47 బంతుల్లో 99 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాస్‌ బట్లర్‌ (46 బంతుల్లో 67 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రెండో వికెట్‌కు అజేయంగా 167 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు 166 పరుగులతో జయవర్ధనే– సంగక్కర (శ్రీలంక–2010లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును మలాన్, బట్లర్‌ సవరించారు. అంతకు ముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (37 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్‌ డెర్‌ డసెన్‌ (32 బంతుల్లో 74 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హడలెత్తించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 10.3 ఓవర్లలో 127 పరుగులు జత చేశారు.

ఇంగ్లండ్‌ ‘టాప్‌’ ర్యాంక్‌లోకి...
దక్షిణాఫ్రికాపై క్లీన్‌స్వీప్‌ సాధించడంతో ఇంగ్లండ్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టేసి టాప్‌ ర్యాంక్‌ను అందుకుంది. టి20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో మలాన్‌ తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మలాన్‌ 915 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ 915 రేటింగ్‌ పాయింట్లు సాధించడం ఇదే ప్రథమం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement