12 వికెట్లతో చెలరేగిన అట్కిన్సన్‌.. విండీస్‌కు ఘోర పరాభవం | England Beat West Indies By Innings And 114 Runs In Lords Test, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

ENG Vs WI 1st Test: 12 వికెట్లతో చెలరేగిన అట్కిన్సన్‌.. విండీస్‌కు ఘోర పరాభవం

Published Fri, Jul 12 2024 5:30 PM | Last Updated on Fri, Jul 12 2024 6:00 PM

England Beat West Indies By Innings And 114 Runs In Lords Test

లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అరంగేట్రం పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్‌ ధాటికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ అట్కిన్సన్‌ (7/45), ఆండర్సన్‌ (1/26), క్రిస్‌ వోక్స్‌ (1/29), స్టోక్స్‌ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మికైల్‌ లూయిస్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేశారు. జాక్‌ క్రాలే 76, ఓలీ పోప్‌ 57, జో రూట్‌ 68, హ్యారీ బ్రూక్‌ 50, జేమీ స్మిత్‌ 70 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌ 4, గుడకేశ్‌ మోటీ, జేసన్‌ హోల్డర్‌ తలో 2, అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

250 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ను అట్కిన్సన్‌ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించాడు. అట్కిన్సన్‌తో పాటు ఆండర్సన్‌ (3/32), స్టోక్స్‌ (2/25) రాణించడంతో విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మోటీ (31 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ ఆండర్సన్‌ తన సుదీర్ఘ కెరీర్‌ను గెలుపుతో ముగించాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement