
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇంగ్లండ్ కోచ్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. చివరిరోజు ఆటలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు ఎక్కువయ్యాయని, అయితే వీటిని మ్యాచ్ గెలిచేందుకు ఉపయోగించుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఆండర్సన్‌ను రెచ్చగొడుతూ ముందుగా టీమిండియా ఆటగాళ్లే మాటల యుద్ధానికి తెరలేపారని, అందుకు తాము కూడా తగు రీతిలో బదులు ఇవ్వాల్సి వచ్చిందని సొంత జట్టు ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. రెండో టెస్టులో తాము గెలవాల్సింది, కానీ.. బుమ్రా-షమీ ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని వెల్లడించాడు. టీమిండియా ఓటమి తప్పించుకునే ఉద్దేశంతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్ ఫలితంతో కాస్త నిరాశ చెందినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లోని అసలైన మజాను ఆస్వాదించామని తెలిపాడు. ఏదిఏమైనా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడాల్సిన అవసరం లేదని, మూడో టెస్ట్‌లో టీమిండియాపై కచ్చితంగా పైచేయి సాధించి లెక్క సరిచేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కాగా, సోమవారం ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీసేన 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా ఆగస్ట్ 25న ప్రారంభంకానుంది.
చదవండి: నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment