రహానేను బౌల్డ్ చేశాక అండర్సన్ సంబరం
రచ్చ గెలిచిన భారత్ అదే ఊపులో ఇంట మాత్రం గెలవలేకపోయింది. బ్రిస్బేన్ విజయంతో శిఖరాన నిలిచిన మన జట్టు మద్రాసులో మళ్లీ నేలకు దిగింది. ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేసిన టీమిండియా చివరకు ప్రత్యర్థి ముందు తలవంచాల్సి వచ్చింది. ఒకే రోజు 381 పరుగులు చేయడం అసాధ్యమనిపించిన చోట పోరాటపటిమ కనబర్చి ‘డ్రా’ చేసుకోగలదనుకున్న కోహ్లి బృందం కనీసం 60 ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేసింది. చివరి రోజు అనూహ్యంగా స్పందిస్తూ స్పిన్‌కు అనుకూలించిన పిచ్ మన ఓటమికి బాటలు వేయగా... పేలవ ఆటతో బ్యాట్స్‌మెన్ పరాజయాన్ని ఆహ్వానించారు. అనామక స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లతో భారత్‌ను పడగొట్టగా, ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడైన అండర్సన్ అద్భుత పేస్ బౌలింగ్‌తో అసలు దెబ్బ కొట్టాడు. స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత మన జట్టు మొదటిసారి ఓడగా, కోహ్లి నాయకత్వంలో ఇది వరుసగా నాలుగో టెస్టు పరాజయం. ఇక 2012 సిరీస్ ఫలితం పునరావృతం కాకూడదనుకుంటే ఈ ఓటమిని మరచి నాలుగు రోజుల తర్వాత ఇదే చెపాక్ మైదానంలో మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో, కొత్త వ్యూహంతో బరిలోకి దిగి రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడమే ఇప్పుడు మన జట్టు ముందున్న తక్షణ లక్ష్యం.
చెన్నై: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 58.1 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (104 బంతుల్లో 72; 9 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (83 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ లీచ్‌కు 4 వికెట్లు దక్కగా, పేసర్ అండర్సన్ 3 కీలక వికెట్లు తీశాడు. చివరి రోజు తొలి సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్ టీ విరామానికి ముందే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తాజా విజయంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌కు 1–0తో ఆధిక్యం లభించగా... రెండో టెస్టు ఈ నెల 13 నుంచి ఇదే మైదానంలో జరుగుతుంది.
కోహ్లి పోరాడినా...
ఓవర్‌నైట్ స్కోరు 39/1తో గిల్, పుజారా (15) చివరి రోజు ఆట కొనసాగించారు. ఆరు ఓవర్ల వరకు వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే లీచ్ ఒక చక్కటి బంతితో ఆటను మలుపు తిప్పాడు. టర్న్, బౌన్స్ కలగలిసిన బంతిని ఆడలేక పుజారా స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత అండర్సన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనకు 18 పరుగుల వ్యవధిలో గిల్, రహానే (0), పంత్ (11) వికెట్లను కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ (0)ను బెస్ వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి, అశ్విన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన కోహ్లి ఆఫ్ స్పిన్నర్ బెస్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 74 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించి కుదురుకుంటున్న దశలో లీచ్ మళ్లీ దెబ్బ తీశాడు. అశ్విన్‌ను అతను పెవిలియన్ పంపించడంతో కీలక భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. నదీమ్ (0), బుమ్రా (4) వికెట్లతో ఓటమి లాంఛనం ముగిసింది.
కోహ్లి బౌల్డ్.. గిల్ బౌల్డ్ అయిన దృశ్యాలు
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 578; భారత్ తొలి ఇన్నింగ్స్: 337; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 178; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) లీచ్ 12, గిల్ (బి) అండర్సన్ 50; పుజారా (సి) స్టోక్స్ (బి) లీచ్ 15; కోహ్లి (బి) స్టోక్స్ 72; రహానే (బి) అండర్సన్ 0; రిషభ్ పంత్ (సి) రూట్ (బి) అండర్సన్ 11; వాషింగ్టన్ సుందర్ (సి) బట్లర్ (బి) బెస్ 0; అశ్విన్ (సి) బట్లర్ (బి) లీచ్ 9; నదీమ్ (సి) బర్న్స్ (బి) లీచ్ 0; ఇషాంత్ (నాటౌట్) 5; బుమ్రా (సి) బట్లర్ (బి) ఆర్చర్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (58.1 ఓవర్లలో ఆలౌట్) 192.
వికెట్ల పతనం: 1–25, 2–58, 3–92, 4–92, 5–110, 6–117, 7–171, 8–179, 9–179, 10–192. బౌలింగ్: ఆర్చర్ 9.1–4–23–1, లీచ్ 26–4–76–4, అండర్సన్ 11–4–17–3, బెస్ 8–0–50–1, స్టోక్స్ 4–1–13–1.
Comments
Please login to add a commentAdd a comment