
Australia Tour Of Pakistan 2022: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మార్చ్-ఏప్రిల్ నెలల్లో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పుకుంది. పర్యటనలో భాగంగా ఆసీస్-పాక్ జట్ల మధ్య మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ జరగనున్నాయి. అయితే, ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భద్రతా కారణాలను సాకుగా చూపి పాక్ పర్యటనకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటనపై పాక్ మాజీలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలాకాలం తర్వాత ప్రపంచ మేటి జట్టు తమ దేశంలో పర్యటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇటీవల కాలంలో కొన్ని జట్లు నిరాధారమైన కారణాల చేత తమతో క్రికెట్ ఆడేందుకు వెనకడుగు వేశాయని, ఇది తమను, తమ అభిమానులు తీవ్రంగా కలచి వేసిందని, అంతే కాకుండా తమ దేశ క్రికెట్ బోర్డును భారీగా నష్టాల పాలు చేసిందని వాపోయాడు.
ఫైనల్‌గా ఆసీస్ జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకోవడం శుభపరిణామమని, ఈ పర్యటన కార్యరూపం దాల్చితే, యావత్ పాక్ ఆసీస్ జట్టుకు స్వాగతం పలుకుతుందని, ఈ సిరీస్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. పాక్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్‌లు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతూ.. ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నారని పేర్కొన్నాడు. ఈ బంధం బలపడేందుకు పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ తన వంతు సహకారాన్ని అందించాడని గుర్తు చేశాడు.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు.. ఇకపై..!
Comments
Please login to add a commentAdd a comment