CWC 2023- Glenn Maxwell- Pat Cummins: వరల్డ్‌కప్ టోర్నీలో 68 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు.. స్ట్రయిక్‌రేటు 17.65.. వన్డేల్లో ఓ ‘బ్యాటర్’ ఖాతాలో ఇంతకంటే చెత్త గణాంకాలు ఉండవనే భావన కలగడం సహజం. కానీ.. ఈ గణాంకాలే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ప్రశంసల వర్షానికి కారణమయ్యాయి.
గెలుపు కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో మరో ఎండ్‌లో ఉన్న బ్యాటింగ్ డైనమైట్‌కు ఊతంగా.. జట్టు ఓటమికి అడ్డుగా నిలిచిన అతడి తీరును ‘ది వాల్’ అంటూ కొనియాడేలా చేశాయి. ప్రపంచకప్-2023లో భాగంగా ఆఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించింది.
పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ
ముంబై వేదికగా వాంఖడేలో అఫ్గన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీతో మెరిస్తే.. బౌలర్లు సైతం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను ఆరంభంలోనే బెంబేలెత్తించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు.
నేనున్నానంటూ బ్యాటెత్తిన మ్యాక్సీ.. అద్వితీయ ఇన్నింగ్స్‌తో
కానీ.. అక్కడున్నది ఆస్ట్రేలియా.. ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన జట్టు.. అంత తేలికగ్గా ఓటమిని అంగీకరిస్తుందా?! ఛాన్సే లేదు.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది.
సహచర బ్యాటర్లు పెవిలిన్‌కు క్యూ కట్టిన వేళ మాక్సీ తన బ్యాటును ఓ మంత్రదండంలా మార్చి అద్భుతమైన షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు. అఫ్గన్ ఫీల్డర్ల పొరపాట్ల వల్ల తనకు దక్కిన అదృష్టాన్ని రెండుచేతులా ఒడిసిపట్టి అ‘ద్వి’తీయశతకంతో చెలరేగి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానులనూ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మాక్సీ ఇన్నింగ్స్‌లో ఏకంగా 21 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులో చురుగ్గా కదల్లేక ఇబ్బంది పడినా ఈ స్పిన్ ఆల్‌రౌండర్ మంచినీళ్లు తాగినంత సునాయాసంగా పరుగుల వరద పారించడానికి ప్రధాన కారణం కమిన్స్.
ఊతంలా నిలబడి.. ఓటమికి అడ్డుపడి
మాక్సీ అవుటైతే జరిగే ప్రమాదమేమిటో అతడికి తెలుసు.. కాబట్టి స్ట్రైక్ వస్తే వికెట్ పడకుండా జాగ్రత్తపడాలి.. రొటేట్ చేస్తూ మాక్సీకి అండగా నిలబడాలి.. ఇలాంటి ఆలోచనా దృక్పథంతోనే కమిన్స్ అత్యంత బాధ్యతగా వ్యవహరించాడు. మాక్సీకి వందకు వంద శాతం మద్దతుగా ఉంటూ జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లాగే.. ప్యాట్ కమిన్స్ ‘ది వాల్’ ఇన్నింగ్స్ కూడా అలాగే చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జట్టు కష్టాల్లో ఉన్నవేళ.. కమిన్స్ మాక్సీకి సహకరించిన తీరు చూసిన క్రికెట్ ప్రేమికులకు ఓ మంచి ఫినిషర్‌కు ఇలాంటి టెయిలెండర్ తోడైతే మరిన్ని అద్భుతాలు చూడచ్చనే భావన కలగడం సహజం. అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా ఇదే అంటోంది.
‘‘ప్రతీ బ్యాట్‌మ్యాన్‌కి ఇలాంటి ఓ రాబిన్ అవసరం’’అంటూ కమిన్స్ ‘మెరుపుల’ వీడియోను షేర్ చేసింది. కాగా రాబిన్ అనే క్యారెక్టర్ డీసీ కామిక్స్‌లోనిది. పోరాటానికి దిగిన బ్యాట్‌మ్యాన్‌కి సహకరించేవాడే రాబిన్!! మన మాక్సీకి కమిన్స్ మాదిరి!!
ఇక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లోనే కాదు.. నెదర్లాండ్స్ మీద మాక్సీ వేగవంతమైన సెంచరీ నమోదు చేసినపుడు కూడా కమిన్స్ ఇలాగే సహకారం అందించిన విషయం తెలిసిందే.
చదవండి: ఇలాంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment