‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్‌లు డ్రాప్‌ చేయలేదు’ | Ex Pakistan Captain Stunned As Pak Drops 8 Catches vs NZ Eliminate Team India | Sakshi
Sakshi News home page

T20 WC: భారత్‌ అవుట్‌!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్‌ మాజీ కెప్టెన్‌

Published Tue, Oct 15 2024 10:41 AM | Last Updated on Tue, Oct 15 2024 11:39 AM

Ex Pakistan Captain Stunned As Pak Drops 8 Catches vs NZ Eliminate Team India

మహిళల టీ20 ప్రపంచకప్‌-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్‌ చేరాలంటే.. పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తేనే హర్మన్‌ప్రీత్‌ సేన టాప్‌-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.

కానీ.. ఫ్యాన్స్‌ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ కివీస్‌ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో రాణించినా.. ఫీల్డింగ్‌లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు జారవిడిచింది.

లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్‌) నమోదు చేసింది. కివీస్‌ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్‌ మహిళా టీమ్‌.

ఇంత చెత్త ఆట చూడలేదు
ఈ నేపథ్యంలో పాక్‌ మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ సనా మిర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ప్రదర్శనపై స్పందించాడు.

మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్‌’ చేయలేదు
‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్‌’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్‌’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్‌ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్‌ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్‌ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్‌ల జట్టు నుంచి బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్‌ ఇచ్చామని కోచ్‌లు చెప్పిన విషయం తెలిసిందే.

అదే ప్రభావం చూపింది
ఈ నేపథ్యంలో పాక్‌ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్‌ చోప్రా ఇలా సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత పాక్‌ మహిళా జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్‌ చేశాం. కానీ.. బ్యాటింగ్‌.. ముఖ్యంగా ఫీల్డింగ్‌ విభాగంలో  మెరుగ్గా రాణించాల్సింది.

మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్‌లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్‌లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. 

ఆ ఎనిమిది క్యాచ్‌లు 
ఏదేమైనా.. పాకిస్తాన్‌ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్‌లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్‌ చేరాలన్న హర్మన్‌సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్‌ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్‌ వంటి జట్టుతో మ్యాచ్‌ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.

పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ స్కోర్లు
వేదిక: దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
టాస్‌: న్యూజిలాండ్‌.. తొలుత బ్యాటింగ్‌
న్యూజిలాండ్‌ స్కోరు: 110/6 (20)
పాకిస్తాన్‌ స్కోరు: 56 (11.4)
ఫలితం: పాక్‌పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపు.. సెమీస్‌లో అడుగు
మహిళల టీ20 ప్రపంచకప్‌-2024 నుంచి పాకిస్తాన్‌తో పాటు భారత్‌​ కూడా అవుట్‌.

చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్‌.. రోజుకు 400–500 పరుగులైనా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement