ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన పది దేశాల కెప్టెన్లలో ప్రస్తుతం ఒకే ఒక్కరు సారధిగా కొనసాగుతున్నారు. గత వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ (డిఫెండింగ్ ఛాంపియన్) కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, విరాట్ కోహ్లి (ఇండియా), ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్), శ్రీలంక (దిముత్ కరుణరత్నే), ముషరఫే మోర్తజా (బంగ్లాదేశ్), గుల్బదిన్ నైబ్ (ఆఫ్ఘనిస్తాన్), తాజాగా ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) కెప్టెన్సీ బాధ్యతలను నుంచి వైదొలగగా ఒక్క కేన్ విలియమ్సన్ మాత్రమే మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కెప్టెన్లకు ఏమాత్రం కలిసి రానిదిగా చెప్పుకునే గడిచిన వన్డే వరల్డ్ కప్ ఆడిన కెప్టెన్లలో కేన్ మామ తప్ప అంతా ఔటయ్యారు.
వీరిలో కొందరు స్వతహాగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, మరికొందరిని (హోల్డర్, సర్ఫరాజ్, గుల్బదిన్, మోర్తజా, కరుణరత్నే) బలవంతంగా తప్పించారు. తప్పించబడిన కెప్టెన్లలో కొందరు వన్డే జట్టులో స్థానం సైతం కోల్పోయారు. 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన కెప్టెన్లలో మిగిలిన ఒకే ఒక్కడు విలియమ్సన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. కేన్ మామ కెప్టెన్సీ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉంది. గత కొంతకాలంగా అతను మూడు ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో కేన్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ విలియమ్సన్ కూడా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడితే గత వన్డే వరల్డ్‌కప్ ఆడిన కెప్టెన్లంతా ఔటైనట్లే. వరల్డ్‌కప్ ఆడిన పది మంది కెప్టెన్లలో ఒక్క మోర్గాన్ తప్ప మిగతా ఎవ్వరూ అంత హ్యాపీగా జట్టుకు దూరం కాలేదు. ఇంగ్లండ్‌కు తొట్ట తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా మోర్గాన్‌కు మంచి రెస్పెక్ట్ దక్కింది. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌కు నాటి వరల్డ్‌కప్ నుంచే దరిద్రం పట్టుకుంది. 2019 నుంచి మూడేళ్లకు పైగా ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. ఇటీవలే (ఆసియా కప్ 2022) ఓ సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన పోరులో సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ బాదిన కోహ్లి కెరీర్‌లో 71వ సెంచరీ, అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు.
చదవండి: Asia Cup 2022: లంకకు ఎదురుందా!
Comments
Please login to add a commentAdd a comment