వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కొత్త హెడ్ కోచ్‌తో బరిలోకి
జట్టు పేరు మార్చినా ఆటలో రాని మార్పు
గతంలో మేటి కోచ్‌లు పని చేసినా కనిపించని ఫలితం
కొత్త హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌పై భారీ ఆశలు
‘అంగట్లో అన్నీ ఉన్నా... అల్లుడి నోట్లో శని
అన్నట్లు’... మెరుగైన ప్లేయర్లు, అంతకుమించిన సహాయక సిబ్బంది, ప్రతి మ్యాచ్‌లో దగ్గరుండి ప్రోత్సహించే ఫ్రాంచైజీ యాజమాన్యం, అన్నీటికి మించి జట్టు ఎలాంటి ప్రదర్శన చేసినా వెన్నంటి నిలిచే అభిమాన గణం ఇలా అన్నీ ఉన్నా... పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. గత ఏడేళ్లుగా కనీసం టాప్–5లో కూడా నిలవలేకపోయింది. మరి ఇప్పుడు కొత్త హెడ్ కోచ్‌గా ఆ్రస్టేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రాకతోనైనా పంజాబ్ రాత మారుతుందా లేదా వేచి చూడాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. కొన్నేళ్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో లీగ్‌లో ఆడింది. ఆ తర్వాత ఈ పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చుకుంది. అయితేనేం ఐపీఎల్ విన్నర్స్ ట్రోఫీ మాత్రం పంజాబ్ జట్టుకు అందని ద్రాక్షగానే ఉంది. క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, షాన్ మార్‡్ష, డేవిడ్ మిల్లర్, మ్యాక్స్‌వెల్, శిఖర్ ధావన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ప్రాతినిధ్యం వహించినా... టామ్ మూడీ మొదలుకొని అనిల్ కుంబ్లే వరకు ఎందరో దిగ్గజాలు హెడ్ కోచ్‌లుగా పనిచేసినా పంజాబ్ రాత మాత్రం మారడంలేదు.
చివరిసారిగా 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు... గత ఏడు సీజన్లలో కనీసం టాప్–5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట ఓడి 10 పాయింట్లు మాత్రమే సాధించింది.
గాయం కారణంగా ధావన్ కొన్ని మ్యాచ్‌లకే అందుబాటులో ఉండటం... భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్ పేస్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఇలాంటి దశలో జట్టు ప్రక్షాళన చేపట్టిన పంజాబ్ ఆ దిశగా తొలి అడుగు వేసింది.
తన ముద్ర వేస్తాడా?
గత పదేళ్లలో తరచూ ప్లేయర్లను మార్చడం... కెప్టెన్లను మార్చడం... కోచ్‌లను మార్చడం ఇలాంటి వాటితోనే వార్తల్లో నిలుస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది.
ఆటగాడిగా, శిక్షకుడిగా అపార అనుభవం ఉన్న పాంటింగ్ మార్గనిర్దేశకత్వంలో పంజాబ్ ప్రదర్శన మారుతుందని యాజమాన్యం ధీమాగా ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆటగాడిగా, కోచ్‌గా కొనసాగుతున్న రికీ పాంటింగ్... గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రతిభను గుర్తించి సానబెట్టడం, యువ ఆటగాళ్లకు అండగా నిలవడంలో తనదైన ముద్ర వేసిన పాంటింగ్... ఢిల్లీ జట్టును 2020 సీజన్‌లో ఫైనల్‌కు చేర్చాడు.
ముంబై ఇండియన్స్ వంటి స్టార్‌లతో కూడిన జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న పాంటింగ్... పంజాబ్ జట్టును గాడిన పెడతాడని యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే పాంటింగ్‌ను నాలుగేళ్లకు కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ సీఈవో సతీశ్ మీనన్ పేర్కొన్నాడు.
వారికి భిన్నంగా..
ఇప్పటి వరకు పంజాబ్ జట్టుకు టామ్ మూడీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, అనిల్ కుంబ్లే, ట్రెవర్ బేలిస్ కోచ్‌లుగా వ్యవహరించారు. వీరందరికీ భిన్నంగా పాంటింగ్ జట్టును నడిపిస్తాడని యాజమాన్యం ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే పంజాబ్ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పాంటింగ్ వెల్లడించాడు.
‘కొత్త సవాల్ స్వీకరించడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో ఏళ్లుగా జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు... భిన్నమైన జట్టును చూపిస్తా’ అని పాంటింగ్ అన్నాడు.
జట్టులో సమూల మార్పులు ఆశిస్తున్న పాంటింగ్... త్వరలోనే సహాయక బృందాన్ని ఎంపిక చేయనున్నాడు. ప్రస్తుతం బంగర్ పంజాబ్ ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా కొనసాగుతుండగా... లాంగ్‌వెల్ట్ ఫాస్ట్ బౌలింగ్, సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా ఉన్నారు.
కోర్ గ్రూప్‌పై దృష్టి
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ ఈ ఏడాది పంజాబ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అర్‡్షదీప్, జితేశ్ శర్మ, రబడ, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో వంటి పలువురు నాణ్యమైన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వచ్చే ఐపీఎల్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టు కోవాలా లేదా అనే విషయంపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడు.
ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్... అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ ద్వారా పంజాబ్ జట్టుకు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు లభించినట్లైంది.
తాజా సీజన్‌లో అతి క్లిష్ట పరిస్థితులను సైతం ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొని భవిష్యత్తుపై భరోసా పెంచింది. ఇలాంటి వాళ్లను సానబెట్టడంలో సిద్ధహస్తుడైన పాంటింగ్ వేలం నుంచే తనదైన ముద్ర వేస్తాడనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment