ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులోకి సౌతాఫ్రికా దూసుకువచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో గెలుపొందడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. తద్వారా టీమిండియా- ఆస్ట్రేలియా జట్లకు సవాల్ విసిరే స్థితిలో నిలిచింది.
టాప్-2లో టీమిండియా, ఆసీస్
డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింట గెలిచి, మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. అంతేకాదు.. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ క్రమంలో 98 పాయింట్లు, 68.06 విజయాల శాతంతో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సైతం రోహిత్ సేన మాదిరే.. 12 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచి, మూడు ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది.
అయితే, వివిధ మ్యాచ్‌లలో స్లో ఓవర్ రేటు తదితర కారణాల వల్ల ఆస్ట్రేలియా పాయింట్లలో కోత పడటంతో ప్రస్తుతం ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 62.50. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా ,ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. శ్రీలంక తొమ్మిదింట ఐదు విజయాలు, నాలుగు ఓటములతో మూడో స్థానం(60 పాయింట్లు, విజయాల శాతం 55.56)లో ఉంది.
ఆరు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్న ప్రొటిస్
అయితే, ఇటీవలి బెంగళూరు టెస్టులో భారత్‌పై విజయంతో న్యూజిలాండ్ నాలుగోస్థానానికి చేరుకోగా.. తాజాగా సౌతాఫ్రికా కివీస్ జట్టును వెనక్కి నెట్టింది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో తానూ ఉన్నానంటూ ముందుకు వచ్చింది.
PC: ICC
మిగిలినవి గెలిస్తే
రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా ఖాతాలో 40 పాయింట్లు(ఏడింట మూడు గెలుపు, మూడు ఓటమి, ఒకటి డ్రా) ఉన్నాయి. విజయాల శాతం 47.62. ఈ సీజన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా ఐదు టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటన్నింటిలో గెలిచిందంటే కచ్చితంగా టాప్-2కు చేరుకునే అవకాశం ఉంటుంది. టీమిండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా నాలుగు గెలిచినా రేసులో ఉండగలుగుతుంది.
డేంజర్‌లో టీమిండియా
కాబట్టి టీమిండియా తమ అగ్రస్థానానికి ముప్పు రాకుండా చూసుకోవాలంటే కివీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో తప్పక గెలవడంతో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో కనీసం రెండు టెస్టుల్లో విజయం సాధించాలి. ఇక సౌతాఫ్రికా తదుపరి బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు ఆడటంతో పాటు శ్రీలంకతో రెండు, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.
ఇక పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరతాయన్న విషయం తెలిసిందే. 2019-21, 2021-23 సీజన్లలో భారత్ ఫైనల్ చేరినా.. ఆయా ఎడిషన్లలో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకున్నాయి.
చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment