ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆర్సీబీ మరో ఘోర ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టినప్పటికి.. బౌలర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు.
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముంబై సునాయాసంగా కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. మంచు ప్రభావం తమ కొంపముంచిందని డుప్లెసిస్ తెలిపాడు.
"మేము ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాలి. టాస్ గెలిచింటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఎందుకంటే మేము కూడా తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది.
మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. వారు బాగా ఆడారు. మాపై ఒత్తిడి తెచ్చారు. బౌలింగ్‌లో కూడా అద్బుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో మేము కూడా చాలా తప్పులు చేశాము. ఇటువంటి వికెట్‌పై 190 పైగా స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు.
పవర్‌ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి 250 పైగా పరుగులు చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. అయితే పాటిదార్, నేను క్రీజులో ఉన్నప్పుడు పెద్ద స్కోర్ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ చేశాడు.
అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బుమ్రాని ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ గైడన్స్‌లో జస్ప్రీత్ మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. అటువంటి క్లాస్ బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని మాకు తెలుసు. కాబట్టి రాబోయో మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి భారీ స్కోర్లు సాధించాలని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ఫాప్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment