Photo Credit: Twitter
టీ20 క్రికెట్‌లో భారత్, జపాన్ మధ్య సానో అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్ ఉత్కంఠ పోరుకు వేదికగా మారింది. వర్షం అంతరాయంతో 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా గతంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో తక్కువ పరుగుల తేడాతో మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఒకసారి పరిశీలిద్దాం.
సౌతాఫ్రికాపై పరుగు తేడాతో
2012 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సురేశ్ రైనా (45), రోహిత్ (25) రాణించారు.

Photo Credit: BCCI Twitter
అనంతరం సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. జహీర్ ఖాన్, బాలాజీ చెరో 3 వికెట్లు తీయగా, యువరాజ్ సింగ్ ( 21 పరుగులు, రెండు వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ముచ్చెమటలు పట్టించిన బంగ్లాదేశ్

Photo Credit: BCCI Twitter
2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. రైనా (30), కోహ్లి (24), ధావన్ (23) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అశ్విన్, జడేజా, పాండ్యాలు కట్టుదిట్టంగా బంతులేయడంతో టీమిండియా ఒక్క పరుగుతో గట్టెక్కింది.
లంకపై 2 పరుగుల తేడాతో..

Photo Credit: BCCI Twitter
2023లో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ముంబై వేదికగా జరిగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా (41 నాటౌట్) రాణించాడు. అనంతరం లంక 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. శివమ్ మావి 4 వికెట్లు పడగొట్టాడు.
జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో..

Photo Credit: BCCI Twitter
2016లో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత టీమిండియా 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా, ఆ తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. కేదార్ జాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.
చుక్కలు చూపించిన ఐర్లాండ్

Photo Credit: BCCI Twitter
2022లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా 2-0తో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. అయితే రెండో టీ20లో ఐర్లాండ్ మాత్రం టీమిండియాను దాదాపు ఓడించినంత పని చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104) సెంచరీకి తోడు సంజూ శాంసన్ (77) మెరుపులు తోడవ్వడంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఆండ్రూ బాల్బరిన్ (60), పాల్ స్టిర్లింగ్ (40) రాణించడంతో ఐర్లాండ్ గెలుపు దిశగా పయనించింది. కానీ చివర్లో ఒత్తిడితో విజయానికి నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఇదీ చదవండి: ఆఖర్లో హైడ్రామా.. వైడ్ ఇచ్చుంటే భారత్ కొంపమునిగేదే!


