లియోనల్ మెస్సీ.. క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేర్లు. ఆటలో ఎంత పేరు సంపాదించారో అభిమానంలోనూ అంతే. వీరిద్దరి గురించి ఫుట్‌బాల్ తెలియనివాళ్లకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఒకరు అర్జెంటీనా తరపున స్టార్‌గా వెలుగుతుంటే.. మరొకరు పోర్చుగల్ తరపున తన హవా కొనసాగిస్తున్నాడు. గోల్స్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆటలో శత్రువులుగా ఉన్న వీళ్లకి బయట మాత్రం మంచి స్నేహం ఉంది. అయితే ఇద్దరికి తీరని కల ఒకటి ఉంది. అదే ఫిఫా వరల్డ్‌కప్.
ఫుట్‌బాల్‌లో స్టార్లుగా వెలుగొందుతున్న వీళ్ల ఖాతాలో ఒక్క ఫిఫా టైటిల్ కూడా లేదు. అందుకే నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని ఎలాగైనా తమ జట్టుకే అందించాలని ఈ ఇద్దరు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక అభిమానులు కూడా అర్జెంటీనా, పోర్చుగల్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే బాగుంటుందని.. మెస్సీ, రొనాల్డో ఎదురుపడితే ఆ మజానే వేరుగా ఉంటుందని కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల మిత్రుడు మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీ నాకు ఎప్పటికి మంచి మిత్రుడే.. వేరే దేశాలకు ఆడుతున్నా మా స్నేహం మాత్రం ఎప్పటిలాగే ఉంటుందని శుక్రవారం పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.
"మెస్సీ ఒక అద్భుతమైన ప్లేయర్. అతన్ని చూస్తుంటే ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. ఓ వ్యక్తిగా మేము ఇద్దరం 16 ఏళ్లుగా ఫుట్‌బాల్ ఫీల్డ్‌ను పంచుకుంటున్నాం. ఒక్కసారి ఊహించుకోండి 16 ఏళ్లు. అందుకే అతనితో మంచి రిలేషన్‌షిప్ ఉంది. అతడు నా ఫ్రెండ్ అని చెప్పను. ఫ్రెండ్ అంటే ఇంటికి వస్తాడు. ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అతడు ఫ్రెండ్ కాదు కానీ టీమ్ మేట్‌లాంటి వాడు.
మెస్సీ నా గురించి మాట్లాడే తీరు చూస్తే ఎప్పుడూ అతన్ని గౌరవిస్తాను. అంతెందుకు అతని భార్య లేదా నా భార్య అయినా కూడా వాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. వాళ్లు అర్జెంటీనాకు చెందిన వాళ్లు. నా గర్ల్‌ఫ్రెండ్‌ది కూడా అర్జెంటీనాయే. మెస్సీ గురించి ఏం చెబుతాం? గొప్ప వ్యక్తి. ఫుట్‌బాల్‌ను నాకంటే గొప్పగా ఆడతాడు" అంటూ తెలిపాడు.
ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా.. సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. మరోవైపు పోర్చుగల్ మాత్రం ఉరుగ్వే, ఘనా, సౌత్ కొరియాలతో కలిసి గ్రూప్ హెచ్‌లో ఉంది. గ్రూప్ దశలో ఈ రెండుజట్లు తలపడే అవకాశం లేదు. నాకౌట్ దశలో మాత్రం ఎదురపడే చాన్స్ ఉంది. అయితే ఈ రెండు టీమ్స్ ఫైనల్ చేరి.. అక్కడ మెస్సీ, రొనాల్డో ముఖాముఖి తలపడితే చూడాలనుకుంటున్నట్లు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
చదవండి: FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే
Comments
Please login to add a commentAdd a comment