ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో, ఇన్‌సెట్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్ వేదికలను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సమాఖ్య) తోసి పుచ్చింది. ఇప్పటికే మ్యాచ్ వేదికలను సిద్ధం చేశామని, ముందు అనుకున్న ప్రకారమే షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో తెలిపారు.
ఇరాన్ అభ్యర్థన సహా పలు అంశాలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిఫా పాలకమండలి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గియాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా సభ్య సమాఖ్య చేసిన ఫిర్యాదులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు.
‘గత డిసెంబర్‌లోనే ఫిఫా మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేశాము. దీంతో మ్యాచ్ వేదికలను మెక్సికోకు మార్చాలన్న ఇరాన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇరాన్ మ్యాచ్ వేదికలను మార్చలేము. అందుకే షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లను నిర్వహించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పాలస్తీనా ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తున్నాం. భౌగోళిక రాజకీయాలను పరిష్కరించేందుకు ఫిఫా పనిచేయదు. కాకపోతే యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలనే విషయానికి ఫిఫా కట్టుబడి ఉంటుంది.’ అని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య మొదలైన యుద్ధం మూడు వారాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. అయితే సాకర్ ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్ యుద్ధానికి రెండు నెలల ముందే విడుదలయ్యింది. అమెరికా, కెనెడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ జూన్ 11న ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం,న్యూజిలాండ్, ఈజిప్ట్‌లతో తమ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
అయితే ఇరాన్ తన మూడు మ్యాచ్‌లను అమెరికాలోనే ఆడాల్సి ఉండగా.. లాస్‌ఏంజిల్స్ వేదికగా రెండు, మరో మ్యాచ్‌ను సియాటెల్‌లో ఆడాల్సి ఉంది. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమ లీగ్ మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఫిఫాను విజ్ఞప్తి చేసింది. తాజాగా ఫిఫా నిర్ణయం ఇరాన్‌ను చిక్కుల్లో పడేసినట్లయింది. ఇప్పుడు ఇరాన్ ముందు రెండే ఆప్షన్లు.. ఆడడం లేదా టోర్నీ నుంచి వైదొలగడం. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ ఫిఫా ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


