‘టై’గా ముగిసిన తొలి వన్డే
రాణించిన రోహిత్, అక్షర్ పటేల్
తిప్పేసిన అసలంక, హసరంగ
రేపు రెండో వన్డే
కొలంబో: శ్రీలంక చేసిన స్కోరు 230/8. ఇదేమంత పెద్ద లక్ష్యమేం కాదు... సులువైందే కానీ కష్టం, అసాధ్యం కానేకాదు. కానీ పిచ్ స్పిన్‌కు దాసోహమైంది. ఇది ఆతిథ్య బౌలర్లకు కలిసొచ్చింది. టి20 సిరీస్‌లో తేలిపోయిన లంకేయులు... తొలి వన్డేలో మాత్రం పట్టు సడలించకుండా పోరాడారు. ఫలితం ‘టై’ అయినప్పటికీ రోహిత్, కోహ్లిలు ఉన్న పటిష్ట జట్టును శ్రీలంక సమష్టిగా నిలువరించింది. దీంతో భారత్ 11 బంతులున్నా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దునిత్ వెలలగే (65 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), పతున్ నిసాంక (75 బంతుల్లో 56; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్, ఓపెనర్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (57 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 31; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.
ఆదుకున్న వెలలగే
ఆరంభంలోనే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ నిసాంక, కుశాల్ మెండిస్ (14) కుదురుగా ఆడటంతో రెండో వికెట్‌కు 39 పరుగులు జతయ్యాయి. తర్వాత స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. కుశాల్, సమరవిక్రమ (8) వికెట్లను పారేసుకోవడంతో 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
తర్వాత కెప్టెన్ అసలంక (14), నిసాంక వికెట్లను కాపాడుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. 91 పరుగుల వద్ద అసలంక, 67 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాక నిసాంక కూడా అవుటవడంతో లంక జట్టు 101 పరుగుల వద్ద సగం వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో లియనాగే (26 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), దునిత్ వెలలగే వికెట్ల పతనానికి కాసేపు బ్రేక్ వేయడంతో ఆరో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం జతయ్యింది. మరింత బలపడకముందే ఈ జోడీని అక్షర్ విడగొట్టాడు. హసరంగ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధనంజయ (17)లతో కలిసి దునిత్ జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు.
రాణించిన రోహిత్
సులువైన లక్ష్యానికి సరైన శుభారంభాన్ని ఓపెనర్లు రోహిత్, శుబ్‌మన్ గిల్ (16) ఇచ్చారు. కెపె్టన్ రోహిత్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగాడు. 5.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. పదో ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ 71/0 స్కోరు చేసింది. తర్వాత 11వ ఓవర్ నుంచి లంక బౌలర్ల ప్రతాపం మొదలైంది. పరుగుల రాక గగనమైంది.
ఈ ఐదు ఓవర్లలో కేవలం 15 పరుగులే చేసిన భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తదనంతరం సుందర్ (5) అవుటయ్యాడు. 12 పరుగుల వ్యవధిలోనే ఈ మూడు వికెట్లు కూలడంతో భారత్ 87/3 స్కోరు చేసింది. ఈ దశలో కోహ్లి (24; 2 ఫోర్లు), అయ్యర్ (23; 4 ఫోర్లు) నింపాదిగా ఆడి జట్టు స్కోరును వంద దాటించారు.
నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాక కోహ్లిని హసరంగా ఎల్బీగా పంపగా, కాసేపటికే, బుల్లెట్‌లాంటి బంతితో ఫెర్నాండో అయ్యర్‌ను బౌల్డ్ చేయడంతో 132/5 స్కోరు వద్ద భారత్ కష్టాల్లో పడింది. తర్వాత రాహుల్, అక్షర్ మెరుగ్గా ఆడినా, దూబే (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) సిక్స్‌లు, ఫోర్‌తో గెలుపు మెట్టుపై నిలబెట్టినా... కెప్టెన్ అసలంక వేసిన 48వ ఓవర్లో దూబే, అర్‡్షదీప్ అవుటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
2 భారత్, శ్రీలంక జట్ల మధ్య ‘టై’ అయిన మ్యాచ్‌లు. ఈ రెండు జట్ల మధ్య 2012లో హోబర్ట్ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీ మ్యాచ్ తొలిసారి ‘టై’గా ముగిసింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 169 వన్డేల్లో తలపడ్డాయి. 99 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 57 మ్యాచ్‌ల్లో లంక గెలిచింది. 11 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
సూపర్ ఓవర్ ఉండదా?
ఐసీసీ నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో సూపర్ ఓవర్‌కు అవకాశం లేదు. రెండు కంటే ఎక్కువ జట్లు అనగా, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఫలితం కోసం ‘సూపర్ ఓవర్’ను అనుమతిస్తారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 56; అవిష్క (సి) అర్‡్షదీప్ (బి) సిరాజ్ 1; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దూబే 14; సమరవిక్రమ (సి) గిల్ (బి) అక్షర్ 8; అసలంక (సి) రోహిత్ (బి) కుల్దీప్ 14; జనిత్ (సి) రోహిత్ (బి) అక్షర్ 20; వెలలగే (నాటౌట్) 67; హసరంగ (సి) అక్షర్ (బి) అర్‡్షదీప్ 24; ధనంజయ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 17; షిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–7, 2–46, 3–60, 4–91, 5–101, 6–142, 7–178, 8–224. బౌలింగ్: సిరాజ్ 8–2–36–1, అర్‡్షదీప్ 8–0–47–2, అక్షర్ 10–0–33–2, దూబే 4–0–19–1, కుల్దీప్ 10–0–33–1, సుందర్ 9–1–46–1, గిల్ 1–0–14–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 58; గిల్ (సి) కుశాల్ మెండిస్ (బి) వెలలగే 16; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ 24; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ధనంజయ 5; అయ్యర్ (బి) అసిత ఫెర్నాండో 23; రాహుల్ (సి) వెలలగే (బి) హసరంగ 31; అక్షర్ (సి) కుశాల్ మెండిస్ (బి) అసలంక 33; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 25; కుల్దీప్ (బి) హసరంగ 2; సిరాజ్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1–75, 2–80, 3–87, 4–130, 5–132, 6–189, 7–197, 8–211, 9–230, 10–230. బౌలింగ్: అసిత ఫెర్నాండో 6–1–34–1, షిరాజ్ 4–0–25–0, వెలలగే 9–1–39–2, ధనంజయ 10–0–40–1, హసరంగ 10–0–58–3, అసలంక 8.5–0–30–3.
Comments
Please login to add a commentAdd a comment