మొదలుకాని అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ తొలి టెస్టు
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు.
కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు.
మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్‌లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment