
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ నమోదు కాని ఓ ఫీట్ సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో నమోదైంది. అరంగేట్రంలో 9వ స్థానంలో వచ్చి 80 ప్లస్ స్కోర్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ చరిత్ర సృష్టించాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 81 పరుగులతో అజేయంగా నిలిచాడు.
టెస్ట్ అరంగేట్రంలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్లు
81* - కార్బిన్ బాష్ (SA) vs PAK, సెంచూరియన్, 2024
72 - మిలన్ రత్నాయకే (SL) vs ENG, ఓల్డ్ ట్రాఫోర్డ్, 2024
71 - బల్వీందర్ సంధు (IND) vs PAK, హైదరాబాద్ (సింద్), 1983
65 - డారెన్ గోఫ్ (ENG) vs NZ, ఓల్డ్ ట్రాఫోర్డ్, 1994
59 - మొండే జోండేకి (SA) vs ENG, హెడింగ్లీ, 2003
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బాష్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటాడు. బ్యాట్‌తో వరల్డ్ రికార్డు స్కోర్ సాధించడానికి ముందు బాష్ నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సహా నాలుగు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో బాష్ 122 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అరంగేట్రంలో ఎనిమిది అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్‌రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment