Rohit Sharma's Counter On India's Successive WTC Final Failure: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తున్నప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న రోహిత్‌ను సారథిగా తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు హిట్‌మ్యాన్.
కరేబియన్ దీవిలో
కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భాగంగా టీమిండియా వెస్టిండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన బుధవారం(జూలై 12) నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఓపెనింగ్ జోడీగా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ బరిలోకి దిగడం ఖాయమని తెలిపాడు. శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని వెల్లడించాడు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ముఖ్యంగా ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణం ఏంటనే ప్రశ్న రోహిత్‌కు ఎదురైంది.
వాళ్లంతా అందుబాటులో ఉంటే
ఇందుకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటాను. నా జట్టులోని కీలక ఆటగాళ్లంతా వందకు వంద శాతం టీమ్‌తోనే ఉండాలి. గాయాల బెడద అస్సలు ఉండకూడదు. అన్నింటికంటే ముఖ్యమైనది అదే’’ అని రోహిత్ బదులిచ్చాడు.
అదే విధంగా.. గత కొన్నేళ్లుగా టీమిండియా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోందన్న ఈ ముంబైకర్.. ఒక్కోసారి అదృష్టం వెక్కిరిస్తే చేదు అనుభవాలు తప్పవని పేర్కొన్నాడు. గత ఐదారేళ్లుగా భారత జట్టు ప్రతిచోటా జయకేతనం ఎగురవేసిందన్న రోహిత్.. చాంపియన్‌షిప్స్ కూడా గెలవడం ముఖ్యమేనని.. అందుకు తాము తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు.
కాగా ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడిన రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీలక బ్యాటర్ రిషభ్ పంత్, మిడిలార్డర్ స్టార్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఈ మేరకు ఆటగాళ్లు అందుబాటులో ఉంటే బాగుంటుందని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్
టీమిండియా నుంచి ఒకే ఒక్కడు! రోహిత్ ఇంకొకటి! కోహ్లి మాత్రం...
Comments
Please login to add a commentAdd a comment