PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ నుంచి ఇంత దారుణ ప్రదర్శన సగటు అభిమాని ఊహించి ఉండడు. ఇప్పటివరకు సీజన్‌లో భోణీ చేయని ముంబై ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ప్లేఆఫ్ దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు గెలిచినప్పటికి అవి కేవలం ప్రత్యర్థి జట్లను దెబ్బతీయడం మాత్రమే అవుతుంది. ఎలా చూసుకున్నా ముంబై ఇండియన్స్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది.
ఈ సంగతి పక్కనబెడితే.. ముంబై ఇండియన్స్ జట్టులోకి టీమిండియా సీనియర్ బౌలర్ ధవల్ కులకర్ణి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ధవల్ కులకర్ణితో ఈ సీజన్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా ముంబై ఇండియన్స్‌తో చేరకముందు ధవల్ కులకర్ణి ఐపీఎల్‌లోనే కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన అనుభవం అతనికి కలిసొచ్చింది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ నాసిరకంగా తయారైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 229 పరుగులిచ్చుకొని ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. మిగతా బౌలర్లు చూసుకుంటే.. జైదేవ్ ఉనాద్కట్ పెద్ద తలనొప్పిగా మారాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో బౌలింగ్ వేసిన అతను 17 పరుగులను కాపాడలేకపోయాడు. ఎంఎస్ ధోని అతని బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఉనాద్కట్ ఆరు మ్యాచ్‌ల్లో 190 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
టైమల్ మిల్స్ ఆరు మ్యాచ్‌ల్లో 190 పరుగులిచ్చి ఆరు వికెట్లు, బాసిల్ థంపి ఐదు మ్యాచ్‌ల్లో 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక రిలే మెరిడిత్ కూడా రెండు మ్యాచ్‌లాడి 65 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో ధవల్ కులకర్ణి ఎంట్రీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బయోబబూల్ పూర్తి చేసుకున్న ధవన్ కులకర్ణి ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేశాడు. గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన ధవల్ కులకర్ణి 92 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు పడగొట్టాడు. కాగా 2008లో ధవల్ కులకర్ణి ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ధవల్ కులకర్ణి రావడంతోనైనా గాడిలో పడుతుందేమో చూడాలి. అయితే అభిమానులు మాత్రం కులకర్ణి రాకపై వినూత్న రీతిలో స్పందించారు. ''అంతా అయిపోయాకా ఇప్పుడొచ్చి ఏం లాభం.. ముంబై ఇండియన్స్ జట్టును మొత్తం ప్రక్షాళన చేయాలి.. రెగ్యులర్ ప్లేయర్లే ఏం చేయలేకపోతున్నారు.. ఆటలో గ్యాప్ వచ్చిన ధవల్ కులకర్ణి వచ్చి జట్టును గెలిపిస్తాడా'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 30న బలమైన రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్
Comments
Please login to add a commentAdd a comment