‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’ | Former Selector Admits The Mistake Of Not Picking Rayudu | Sakshi
Sakshi News home page

‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’

Published Sat, Nov 21 2020 6:49 PM | Last Updated on Sun, Nov 22 2020 3:45 AM

Former Selector Admits The Mistake Of Not Picking Rayudu - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడుకు చోటు ఇవ్వకపోవడం తాము చేసిన తప్పిదాల్లో ఒకటని అప్పుడు సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న దేవాంగ్‌ గాంధీ పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లో తన పదవీ కాలం ముగిసిన తర్వాత తొలిసారి వరల్డ్‌కప్‌ సెలక్షన్‌పై పెదవి విప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే వరుస చర్చలు కొనసాగుతుండగా, అంబటి రాయుడ్ని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడాన్ని తమ తప్పిదంగానే దేవాంగ్‌ గాంధీ పేర్కొన్నారు. ‘ అవును.. అది మా తప్పిదమే. తప్పు జరిగింది. కానీ మేము కూడా మనుషులమే. ఏది సరైన కాంబినేషన్‌ అనే విషయంలోనే పొరపాటు చేశాం. ఆ కోణంలోనే ఆలోచించాం. ఆ తర్వాత చేసిన పొరపాటు తెలుసుకున్నాం​. (‘ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపండి’)

భారత జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించింది. ఇక్కడ రాయుడు లేని లోటు కనిపించింది. కేవలం ఒక్క మ్యాచ్‌తో టీమిండియా అప్పటివరకూ ఆడింది అంతా పోయింది. సెమీస్‌ తప్పితే మిగతా టోర్నీ అంతా భారత్‌ బాగా ఆడింది. ఇక్కడ రాయుడు కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను. అతని రియాక్షన్‌ను సమర్థించక తప్పదు. ఎవరైనా అలానే రియాక్ట్‌ అవుతారు’ అని దేవాంగ్‌ గాంధీ తెలిపారు.

ఆ సమయంలో రాయుడ్ని పక్కకు పెట్టడంతో పెద్ద వివాదమే చెలరేగింది. రాయుడు స్థానంలో విజయ్‌ శంకర్‌కు చోటివ్వడమే కాకుండా అతనొక త్రీడీ ప్లేయర్‌ అని అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ విశ్లేషించాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు చూడటానికి తాను త్రీడీ కళ్లద్దాలను ఆర్డర్‌ చేశానంటూ సెటైర్‌ వేశాడు. దాంతో వివాదం మరింత పెద్దదైంది. విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసినా రాయుడుకు పిలుపు రాలేదు. అతని స్థానంలో రిషభ్‌ పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. ఇది రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు వీడ్కోలు చెప్పడం,  మళ్లీ నాటకీయ పరిణామాల మధ్య తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement